బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన ఘనత సాధించాడు. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించిన అనంతరం షకీబ్ ఖాతాలో వరల్డ్ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన షకీబ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో షకీబ్ న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీని అధిగమించాడు.
షకీబ్ 482 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 707 వికెట్లు తీయగా.. వెటోరీ 498 ఇన్నింగ్స్‌ల్లో 705 వికెట్లు పడగొట్టాడు. ఈ విభాగంలో షకీబ్, వెటోరీ తర్వాత రవీంద్ర జడేజా (568 వికెట్లు), రంగన హెరాత్ (525), సనత్ జయసూర్య (440) టాప్-5లో ఉన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో షకీబ్ 16వ స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో మురళీథరన్ (1347) టాప్‌లో ఉన్నాడు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్ట్ విజయం.
పాక్‌ను వారి సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరపించిన తొలి జట్టు కూడా బంగ్లాదేశే కావడం విశేషం. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.
స్కోర్ వివరాలు..
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్)
Comments
Please login to add a commentAdd a comment