
ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలంటారు మన పెద్దలు. విజయగర్వం తలకెక్కితే పతనం తప్పదు. ఏ రంగానికైనా ఈ మాటలు వర్తిస్తాయి. ముఖ్యంగా క్రీడారంగంలో చాలా మంది ప్లేయర్లు తలపొగరుతో కెరీర్ ఆరంభంలోనే తెరమరుగయ్యారు. ఎంతో ప్రతిభావంతుడైన వినోద్ కాంబ్లీ వివాదాలతో క్రికెట్‌కు దూరమయ్యాడు. తాజాగా మరో టీమిండియా (Team India) యువ క్రికెటర్ కూడా ఇదే దారిలో ప్రయనిస్తున్నాడు. ఇప్పటికైనా మేలుకోకుంటే అతడి కెరీర్‌కు ముప్పు తప్పదని సహచరుడొకరు సున్నితంగా హెచ్చరించాడు.
యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిన్న వయసులోనే పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో అందరి ఆకట్టుకున్నాడు. అతడి నాయకత్వంలో యువ టీమిండియా 2018లో అండర్-19 వరల్డ్‌కప్ సాధించింది. అదే ఏడాది జాతీయ జట్టు తరపున అరంగ్రేటం చేసిన ఈ యువ సంచలనం.. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తర్వాత చిన్న వయసులో టెస్టు సెంచరీ సాధించిన రికార్డు కొట్టాడు. దీంతో అతడిని అందరూ సచిన్‌తో పోల్చడం మొదలు పెట్టారు. అటు ఐపీఎల్‌లోనూ అదరగొట్టడంతో మనోడి పేరు మార్మోగిపోయింది.
శశాంక్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ఆటగాళ్ల జీవితాల్లో ఉత్థానపతనాలు సహజం. అయితే పృథ్వీ షా మాత్రం చేజేతులారా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్ లేమితో తన ఉనికినే ప్రశ్నార్థకం చేసుకున్నాడు. జాతీయ జట్టులో స్థానం కోల్పోడంతో పాటు రంజీల్లోనూ అతడికి చోటు కరువైంది. ఐపీఎల్‌లోనూ అతడికి తీసుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదంటే మనోడి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో పృథ్వీ షా గురించి అతడి బాల్యస్నేహితుడు, పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ (Shashank Singh) కీలక వ్యాఖ్యలు చేశాడు.
తక్కువగా అంచనా వేయొద్దు
మళ్లీ గాడిలో పడే సత్తా పృథ్వీ షాకు ఉందని, దీని కోసం అతడు కొన్ని పద్ధతులు మార్చుకోవాలని శశాంక్ సూచించాడు. శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో శశాంక్ మాట్లాడుతూ.. ‘పృథ్వీ షాను తక్కువగా అంచనా వేస్తున్నారు. అతడు మళ్లీ మూలాల్లోకి వెళితే పూర్వ వైభవాన్ని పొందగలడు. పృథ్వీ షా నాకు 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు, అతడితో కలిసి బొంబాయిలో క్లబ్ క్రికెట్ ఆడాను. పృథ్వీ షాలో ఏముందని మీరు నన్ను అడిగితే, అతడికి కొన్ని విషయాలపై భిన్నమైన దృక్పథం ఉంది. అయితే తన జీవనశైలిని కొంచెం మార్చుకుంటే మళ్లీ గాడిలో పడతాడు. రాత్రి 11 గంటలకు బదులుగా రాత్రి 10 గంటలకు నిద్రపోతే మంచింది. అలాగే ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే బాగుటుంది. ఈ మార్పులను అంగీకరించి, ఆచరిస్తే భారత క్రికెట్‌కు మంచి జరుగుతుంది. బహుశా అతడు ఇప్పటికే తన వెంట ఉన్న మంచి వ్యక్తులు చెప్పిన సలహాలను పాటిస్తుండొచ్చు. అతడికి నేను సలహా ఇవ్వాల్సిన అవసరం లేద’ని చెప్పాడు.
చదవండి: అక్షర్ పటేల్ ఐపీఎల్ కప్ కొడతాడా?
ఏకంగా రూ. 5.5 కోట్లు!
కాగా, పృథ్వీ షా ఇటీవల డీవై పాటిల్ టీ20-2025 టోర్నమెంట్‌లో 'రూట్ మొబైల్' జట్టుకు నాయకత్వం వహించాడు. గతేగాది సౌదీ అరేబియాలో నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో రూ. 75 లక్షల కనీస ధరకు అందుబాటులో ఉన్నా ఒక్క ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేయలేదు. 2018లో అతడిని కోటీ 20 లక్షలకు వేలంలో దక్కించుకున్న ఢిల్లీ ఫ్రాంచైజీ.. నిరుడు అతడిని వదిలించుకుంది. మరోవైపు శశాంక్ సింగ్ గత ఐపీఎల్‌లో సత్తా చాటడంతో పంజాబ్ కింగ్స్ అతడిని అట్టేపెట్టుకుంది. ఇందుకోసం ఏకంగా రూ. 5.5 కోట్లు వెచ్చించింది.