SL VS AFG 1st ODI: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా హంబన్‌తోటలో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది. రషీద్ ఖాన్ లాంటి స్టార్ స్పిన్నర్ లేకపోయినా ఆఫ్ఘన్లు.. లంకేయులకు భారీ షాకిచ్చారు. యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, తమ కంటే పటిష్టమైన లంకేయులను 6 వికెట్ల తేడాతో మట్టికరించారు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ 1-0 ఆధిక్యంలో వెళ్లింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (38), దుషన్ హేమంత (22) ఓ మోస్తరుగా రాణించగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ, ఫరీద్ అహ్మద్ మలిక్ చెరో 2 వికెట్లు.. అజ్మతుల్లా ఒమర్‌జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ నబీ తలో వికెట్ పడగొట్టారు.
ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ ఆది నుంచే అద్భుతంగా ఆడి, మరో 19 బంతులుండగానే విజయతీరాలకు చేరింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్భాజ్ (14) విఫలమైనా.. ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా రెండో వికెట్‌కు 146 పరుగులు జోడించి, ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని ఖరారు చేశారు. ఆఖర్లో కెప్టెన్ హస్మతుల్లా షాహిది (38), మహ్మద్ నబీ (27 నాటౌట్) బాధ్యతగా ఆడి ఆఫ్ఘనిస్తాన్‌ను గెలిపించారు.
ఐపీఎల్-2023లో సీఎస్‌కే తరఫున ఇరగదీసిన పేసర్ మతీష పతిరణ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పతిరణ.. 8.5 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ మాత్రమే పడగొట్టాడు. లంక బౌలర్లలో కసున్ రజిత 2, లహీరు కుమార ఓ వికెట్ దక్కించుకున్నారు. పతిరణతో పాటు అరంగేట్రం చేసిన స్పిన్నర్ దుషన్ హేమంత (9-0-50-0) కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ 46.5 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి విజయం సాధించింది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఇదే వేదికగా జూన్ 4న, మూడో వన్డే కూడా ఇదే వేదికగా జూన్ 7న జరుగనున్నాయి.
చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..!
Comments
Please login to add a commentAdd a comment