
శ్రీలంకతో రెండో టీ20లో ఆస్ట్రేలియా విజయం(PC: Cricket Australia)
Australia tour of Sri Lanka, 2022- కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన రెండో టి20లో ఆసీస్ 3 వికెట్లతో గెలిచింది.
మొదట లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 124 పరుగులు చేసింది. అసలంక (39), కుశాల్ మెండిస్ (36) రాణించారు. కేన్ రిచర్డ్‌సన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఆసీస్ 17.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. 26 బంతులు ఎదుర్కొని 26 పరుగులు సాధించిన ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. లంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగకు నాలుగు వికెట్లు దక్కాయి.
ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఆతిథ్య శ్రీలంక జట్టు కెప్టెన్ దసున్ షనక.. టాపార్డర్ విఫలం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ.. తమ బౌలింగ్ విభాగం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని బౌలర్లను కొనియాడాడు. శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేశారన్న ఫించ్.. మాథ్యూ వేడ్ అనుభవం జట్టును విజయాలకు చేర్చడంలో ఉపకరించిందని పేర్కొన్నాడు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో 4-1 తేడాతో సిరీస్ చేజార్చుకున్న లంక రాత స్వదేశంలోనైనా మారుతుందనుకుంటే అలా జరుగలేదు. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే పర్యాటక ఆసీస్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్ జూన్ 11న పల్లెకెలెలో జరుగుతుంది.
శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20:
టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్
శ్రీలంక స్కోరు: 124/9 (20)
ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5)
చదవండి: Mithali Raj: మిథాలీరాజ్ పెళ్లి చేసుకోకపోవడం వెనుక కారణం?
Ind Vs SA: కుర్రాళ్లకు భలే చాన్సులే.. ఇక్కడ మెరిస్తే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాకు!