ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మెగా వేలానికి సంబంధించి ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి మధ్య చర్చలు వాడివేడిగా సాగినట్లు సమాచారం. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని పలువురు ఫ్రాంఛైజీ యజమానులు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిషేధం విధించాలి
‘‘వేలంలో ఓ ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత.. గాయం మినహా ఇతరత్రా కారణాలు చెప్పి సీజన్‌కు దూరమైతే అతడిపై కచ్చితంగా నిషేధం విధించాలి. నిజానికి ఒక్కో ఫ్రాంఛైజీ తమ జట్టు కూర్పు కోసం అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే ఒక ఆటగాడిని కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతుంది.
కానీ కొందరు ఆటగాళ్లు ముఖ్యంగా విదేశీ ప్లేయర్లు వివిధ కారణాలు చెప్పి సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. తక్కువ మొత్తానికి అమ్ముడు పోవడం వల్లే వాళ్లు ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ.. వాళ్లను కొనుక్కున్న మేము.. అర్ధంతరంగా వారు వెళ్లిపోవడం వల్ల కాంబినేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుంది
ఇక రిటెన్షన్ విషయానికొస్తే.. అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు కేటాయించే మొత్తంలో మాకు స్వేచ్ఛ ఇవ్వాలి. అలా అయితే ఆటగాళ్లతో విభేదాలు తలెత్తకుండా ఉంటుంది. ఎందుకంటే.. కొంతమంది తమ కంటే తక్కువ నైపుణ్యాలు కలిగి ఉన్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీ తమ అవసరాల దృష్ట్యా ఎక్కువ మొత్తం చెల్లిస్తుందని భావిస్తూ ఉంటారు. ఇలాంటివి విభేదాలకు దారితీస్తాయి. ఈ వ్యవహారం కాంట్రాక్టు రద్దు చేసుకునేదాకా కూడా వెళ్తుంది.
అయినా.. ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని జట్లలో చాకుల్లాంటి విదేశీ ప్లేయర్లు ఉంటే.. మరికొన్ని జట్లలో టీమిండియా సూపర్‌స్టార్లు ఉంటారు. ఇంకొన్నింటిలో నైపుణ్యాలు గల అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కూడా ఉంటారు.
మా జట్టు బలం వారే
ఉదాహరణకు.. మా విషయమే తీసుకుంటే.. మా జట్టులో విదేశీ ఆటగాళ్ల బెంచ్ పటిష్టంగా ఉంది. కాబట్టి మేము.. నలుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు ఇద్దరు క్యాప్డ్ ఇండియన్స్ లేదంటే ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో పాటు ముగ్గురు అన్‌క్యాప్డ్ ఇండియన్స్.. ఇలాంటి కాంబినేషన్లలో రిటైన్ చేసుకునే విధానం ఉంటే బాగుంటుందని భావిస్తాం. ఈ విషయంలో ఐపీఎల్ పాలక మండలి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి’’ అని కావ్యా మారన్ అభిప్రాయపడింది. ఈ మేరకు క్రిక్‌బజ్ కథనం ప్రచురించింది.
రన్నరప్‌తో సరి
కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎక్కువ శాతం విదేశీ ఆటగాళ్లే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు వరల్డ్‌క్లాస్ టీ20 స్టార్ హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్ వంటి వాళ్లు జట్టుకు బలం. ఇక గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఏకంగా ఫైనల్ చేరుకుంది.
అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన టైటిల్ పోరులో వెనుకబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఆద్యంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి లీగ్ చరిత్రలో ఆల్‌టైమ్ హయ్యస్ట్ స్కోరు(287/3) రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
అక్కడ పది కోట్లు
కాగా ఐపీఎల్-2024 వేలంలో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగను రూ. 1.5 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. అయితే, గాయం పేరు చెప్పి అతడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ అతడు వేరే కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడని ఫ్రాంఛైజీ భావించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఆర్సీబీకి ఆడిన అతడు రూ. 10 కోట్లు అందుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment