అది టీమిండియా- బీ జట్టు కాదు.. మాజీ కెప్టెన్‌కు బోర్డు కౌంటర్‌! | Sri Lanka Cricket: India Not 2nd String Team On Arjuna Ranatunga Comments | Sakshi
Sakshi News home page

India Tour Of Sri Lanka: అది టీమిండియా- బీ జట్టు కాదు.. బోర్డు కౌంటర్‌!

Published Fri, Jul 2 2021 8:56 PM | Last Updated on Fri, Jul 2 2021 9:01 PM

Sri Lanka Cricket: India Not 2nd String Team On Arjuna Ranatunga Comments - Sakshi

కొలంబో: మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక క్రికెట్‌ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న భారత జట్టు సెకండ్‌ టీం కాదని, అన్ని విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కొంతమంది మీడియాలో తమ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. వారందరికీ ఇదే సమాధానం. శ్రీలంక టూర్‌కు వచ్చిన టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు ఎంతో పటిష్టమైనది.

భారత బృందంలోని ప్రస్తుత 20 మందిలో 14 మంది సభ్యులు ఇప్పటికే టీమిండియా తరఫున ఏదో ఒక ఫార్మాట్‌లో, మరికొందరు అన్ని ఫార్మాట్ల(టెస్టు, వన్డే, టీ20)లోనూ ప్రాతినిథ్యం వహించి ఉన్నారు. ఇది ద్వితీయ శ్రేణి జట్టుకాదు’’ అని పరోక్షంగా అర్జున రణతుంగకు కౌంటర్‌ ఇచ్చింది. అదే విధంగా... ఒకేసారి కోహ్లి, ధావన్‌ సారథ్యంలోని భారత జట్టు రెండు వేర్వేరు దేశాల్లో పర్యటించడంపై స్పందిస్తూ... ‘‘క్రికెట్‌ ప్రపంచంలో ఇదొక సరికొత్త విధానం. ముఖ్యంగా ఐసీసీ సభ్య దేశాలు... తమ అవసరాలకు అనుగుణంగా ఒక్కో ఫార్మాట్‌కు ప్రత్యేక స్వ్యాడ్‌తో ఆడించే అవకాశం ఉంటుంది.

ఇలాంటి వాటి వల్ల పోటీతత్వం పెరగడంతో పాటుగా, ఐసీసీకి ఇచ్చిన కమిట్‌మెంట్ల ప్రకారం... వివిధ బోర్డులు తమ మాటను నెరవేర్చుకునే వీలు కలుగుతుంది’’ అని శ్రీలంక క్రికెట్‌ తన ప్రకటనలో పేర్కొంది. కాగా  శ్రీలంక పర్యటనకు టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టును పంపించడం తమ దేశ క్రికెట్‌కు ఘోర అవమానమని అర్జున రణతుంగ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రతిపాదనకు అంగీకరించిన శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు మతి లేదని విరుచుకుపడ్డారు.

ఇక విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లగా.. శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యువఆటగాళ్లతో కూడిన జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. జూలై 13 నుంచి భారత్‌- శ్రీలంక మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు జరగనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement