కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెయింట్ లూసియా కింగ్స్ శుభారంభం చేసింది. ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా ఘన విజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో లూసియా కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది.
అయితే లక్ష్య చేధనలో సెయింట్ లూసియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో లూసియా బ్యాటర్లు టిమ్ సీఫెర్ట్ , భానుక రాజపక్స అద్భుతం చేశారు. వీరిద్దరూ సెయింట్ కిట్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
సిక్సర్ల వర్షం కురిపిస్తూ తమ జట్టును లక్ష్యం వైపు తీసుకువెళ్లారు. సీఫెర్ట్(27 బంతుల్లో 64, 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఔటైనప్పటకి రాజపక్స(67 నాటౌట్) మాత్రం తన దూకుడును కొనసాగించాడు. వీరిద్దరితో పాటు డేవిడ్ వీస్(20 బంతుల్లో 34) తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఫలితంగా భారీ లక్ష్యాన్ని సెయింట్ లూసియా సునాయసంగా ఛేదించింది.
లూయిస్ సెంచరీ వృధా..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సెయింట్ కిట్స్ ఓపెనర్ ఎవెన్ లూయిస్ సెంచరీతో మెరిశాడు. 54 బంతులు ఎదుర్కొన్న 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. అతడితో పాటు కైల్ మైర్స్(92) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సెయింట్ కిట్స్ ఓటమి పాలవ్వడంతో వీరి ఇన్నింగ్స్ వృధా అయిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment