టీమిండియాతో ‘పింక్‌ బాల్‌ టెస్టు’కు ముందు ఆసీస్‌కు మరో షాక్‌! | Steve Smith Faces Injury Scare Ahead Of Pink Ball Test Vs India At Adelaide | Sakshi
Sakshi News home page

టీమిండియాతో ‘పింక్‌ బాల్‌ టెస్టు’కు ముందు ఆసీస్‌కు మరో షాక్‌!

Published Tue, Dec 3 2024 12:48 PM | Last Updated on Tue, Dec 3 2024 4:15 PM

Steve Smith Faces Injury Scare Ahead Of Pink Ball Test Vs India At Adelaide

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన కంగారూ జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకబడింది. ఈ క్రమంలో అడిలైడ్‌ వేదికగా రెండో టెస్టులోనైనా రాణించాలని పట్టుదలగా ఉంది.

అయితే, ఇప్పటికే స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయాల బారిన పడ్డారు. పక్కటెముకల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాజిల్‌వుడ్‌ రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో
పింక్‌ బాల్‌ టెస్టు కోసం అడిలైడ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో స్మిత్‌కు గాయమైనట్లు తెలుస్తోంది. మార్నస్‌ లబుషేన్‌ త్రోడౌన్స్‌ వేస్తుండగా బ్యాటింగ్‌ చేస్తున్న స్మిత్‌ కుడిచేతి బొటనవేలుకు గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాలాడగా.. ఆసీస్‌ జట్టు వైద్య బృందంలోని ఫిజియో నెట్స్‌లోకి వచ్చి స్మిత్‌ పరిస్థితిని పర్యవేక్షించాడు. 

అనంతరం స్మిత్‌ నెట్స్‌ వీడి వెళ్లి పోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన స్మిత్‌ బ్యాటింగ్‌ చేయగలిగినప్పటికీ.. కాస్త అసౌకర్యానికి లోనైనట్లు సమాచారం.

తొలి టెస్టులో విఫలం
ఈ నేపథ్యంలో అడిలైడ్‌ టెస్టుకు స్మిత్‌ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాజీ కెప్టెన్‌ స్మిత్‌ పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన ఈ వెటరన్‌ బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే అవుటయ్యాడు. 

ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో స్మిత్‌ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 755 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 110.

ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆసీస్‌ బుమ్రా సేన చేతిలో 295 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య అడిలైడ్‌లో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. 

పూర్తి స్థాయిలో సన్నద్ధమైన టీమిండియా
పింక్‌ బాల్‌తో జరుగనున్న ఈ టెస్టుకు ఇప్పటికే టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రైమ్‌ మినిస్టర్స్‌ ఎలెవన్‌ జట్టుతో గులాబీ బంతితో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది.  

కాగా రెండో టెస్టుకు హాజిల్‌వుడ్‌ దూరమైన నేపథ్యంలో ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ స్కాట్‌ బోలాండ్‌ను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా.. మిచెల్‌ మార్ష్‌కు కవర్‌గా బ్యూ వెబ్‌స్టర్‌ను పిలిపించింది.

ఇది కూడా చదవండి: పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్‌ టీమ్‌తో రిలేషన్‌!.. బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement