ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా (IND vs AUS 2nd T20) యాజమాన్యం అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను కూడా టీమిండియా ఓటమితో మొదలు పెట్టింది. కాన్‌బెర్రాలో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శుక్రవారం నాటి రెండో టీ20లో నెగ్గిన ఆసీస్ సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది.
125 పరుగులకే ఆలౌట్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్లతో టీమిండియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది.
అభిషేక్ శర్మ (Abhishek Sharma- 37 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హర్షిత్ రాణా (33 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజిల్‌వుడ్ (3/13) మూడు కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
GOOD GRIEF JOSH INGLIS 🤩 #AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/g2Qb2CW7Pj
— cricket.com.au (@cricketcomau) October 31, 2025
ఆసీస్ అలవోకగా
ఓపెనర్లు మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 28 బంతుల్లోనే 51 పరుగులు జోడించి ఆసీస్ గెలుపునకు పునాది వేశారు. జోష్ ఇంగ్లిస్ (20), మిచెల్ ఓవెన్ (14) ఓ మోస్తరుగా రాణించగా.. మార్స్ స్టొయినిస్ (6 నాటౌట్) పని పూర్తి చేశాడు.
పిచ్చి ప్రయోగాలు ఆపండి
ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. ‘‘ఇప్పటికైనా బ్యాటింగ్ ఆర్డర్‌లో పిచ్చి ప్రయోగాలకు టీమిండియా స్వస్తి పలకాలి.
ఈ మ్యాచ్‌లో 160- 170 పరుగులు స్కోరు చేసి గెలవగల సత్తా టీమిండియాకు ఉంది. గత మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో వచ్చి అదరగొట్టాడు. నాటౌట్‌గా నిలిచాడు.
కానీ ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో సంజూను ఎందుకు తీసుకువచ్చారు?.. సంజూను ఓపెనింగ్ స్థానం నుంచి మిడిలార్డర్‌కు పంపారు. మళ్లీ ఇప్పుడు ఐదు నుంచి మూడో స్థానానికి మార్చారు. ఇలాంటి పనుల వల్ల ఎవరు ఎప్పుడు బ్యాటింగ్‌కు రావాలో తెలియని గందరగోళం నెలకొంటుంది.
తిలక వర్మ ఆసియా కప్ ఫైనల్లో నాలుగో స్థానంలో వచ్చి గెలిపించాడు. కానీ ఇప్పుడు అతడిని ఐదో స్థానానికి మార్చారు’’ అని కెప్టెన్ సూర్య, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీరును సదగోపన్ రమేశ్ విమర్శించాడు.
ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది
అదే విధంగా.. శివం దూబేను కాదని హర్షిత్ రాణాను ఏడో స్థానంలో ఆడించడాన్ని కూడా సదగోపన్ రమేశ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టాడు. ‘‘ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది. గొప్ప వంటకాడు గొప్ప డ్రైవర్ కాలేడు. అదే విధంగా మంచి డ్రైవర్ గొప్పగా వంట చేయలేడు.
ఆటగాళ్ల బలాలపై దృష్టి పెట్టి మేనేజ్‌మెంట్ వారికి తగిన పాత్ర ఇవ్వాలి. వారిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వచ్చేలా ప్రోత్సహించాలి. అంతేగానీ బౌలర్‌ను బ్యాటర్‌గా మారుస్తాం.. బ్యాటర్‌తో బౌలింగ్ చేయిస్తాం అంటే ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ విషయంలో యాజమాన్యం ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అంటూ సదగోపన్ రమేశ్.. టీమిండియా నాయకత్వ బృందానికి సూచించాడు.
మార్పులు ఇవే
కాగా మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో రెండో టీ20లో సంజూ శాంసన్ (2) మూడో స్థానంలో రాగా.. సూర్య (1) నాలుగో నంబర్ బ్యాటర్‌గా వచ్చి విఫలమయ్యాడు. ఇక తిలక్ వర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి డకౌట్ అయ్యాడు. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే (4)ను ఎనిమిదో స్థానానికి డిమోట్ చేసి.. పేసర్ హర్షిత్ రాణా (35)ను ఏడో స్థానంలో ఆడించారు.
చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్


