IPL 2024 SRH Vs LSG: సన్‌రైజర్స్‌ విధ్వంసం | IPL 2024 SRH Vs LSG: Sunrisers Hyderabad Beat Lucknow Super Giants By 10 Wickets, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2024 SRH Vs LSG: సన్‌రైజర్స్‌ విధ్వంసం

Published Thu, May 9 2024 3:51 AM | Last Updated on Thu, May 9 2024 11:25 AM

Sunrisers Hyderabad won by 10 wickets

58 బంతుల్లోనే 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్‌  

10 వికెట్లతో ఘనవిజయం

హెడ్, అభిషేక్‌ విశ్వరూపం

16 ఫోర్లు, 14 సిక్స్‌లతో ఊచకోత ∙చిత్తుగా ఓడిన లక్నో 

ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ముంబై అవుట్‌

250 పరుగుల లక్ష్యమైనా సన్‌రైజర్స్‌ ఛేదించేదేమో? ఓటమి తర్వాత లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు కెప్టెన్ రాహుల్‌ వ్యాఖ్య... ప్రత్యర్థి బ్యాటర్ల వీర బాదుడుకు మైదానంలో మొదటి బాధితుడిగా అతను చెప్పిన మాట అక్షరసత్యం. 

తొలుత బ్యాటింగ్‌ చేస్తూ సీజన్‌లో రికార్డు స్కోర్లు సాధించిన హైదరాబాద్‌ ఇప్పుడు ఛేదనలోనూ వి«ధ్వంసం సృష్టించింది. వీడియోగేమ్‌ తరహాలో ట్రవిస్‌ హెడ్, అభిõÙక్‌ శర్మ విరుచుకుపడుతుంటే స్టేడియంలో పరుగుల ఉప్పెన వచ్చింది. 16 ఫోర్లు, 14 సిక్స్‌లంటే 148 పరుగులు బౌండరీలతోనే... లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు. 

కానీ 10 ఓవర్లకు ముందే కేవలం 52 నిమిషాల్లో రైజర్స్‌ ఛేదించిపడేసింది. రైజర్స్‌ ఛేజింగ్‌ రాత్రి 9 గంటల 23 నిమిషాలకు మొదలై 10 గంటల 15 నిమిషాలకు ముగిసింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. లక్నో పరాజయంతో ముంబై ఇండియన్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

సాక్షి, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ బ్యాటింగ్‌ పవర్‌ను మరోసారి చూపించింది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది.

 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఆయుశ్‌ బదోని (30 బంతుల్లో 55 నాటౌట్‌; 9 ఫోర్లు), నికోలస్‌ పూరన్‌ (26 బంతుల్లో 48 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం హైదరాబాద్‌ కేవలం 9.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 167 పరుగులు సాధించి గెలిచింది. 

ఓపెనర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రవిస్‌ హెడ్‌ (30 బంతుల్లో 89 నాటౌట్‌; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 75 నాటౌట్‌; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగి కేవలం 58 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించారు. లక్నో ఓటమితో ముంబై ఇండియన్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ముంబై తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గినా 12 పాయింట్లతో టాప్‌–4లో స్థానాన్ని దక్కించుకునే అవకాశం లేదు.  

రాహుల్‌ విఫలం... 
భువనేశ్వర్‌ చక్కటి బౌలింగ్‌ వల్ల లక్నో ఇన్నింగ్స్‌ పేలవంగా ప్రారంభమైంది. భువీ తన వరుస ఓవర్లలో డికాక్‌ (2), స్టొయినిస్‌ (3)లను పెవిలియన్‌ పంపించాడు. ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సన్వీర్‌ సింగ్‌ అద్భుత క్యాచ్‌లు కారణంగా నిలిచాయి. పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో 27 పరుగులకే పరిమితమైంది. 

ఈ దశలో రాహుల్, కృనాల్‌ ఆదుకునే ప్రయత్నం చేసినా వీరిద్దరూ నెమ్మదిగా ఆడటంతో పరుగులు రావడం మందగించింది. పదో ఓవర్‌ చివరి బంతికి రాహుల్‌ అవుట్‌ కాగా... లక్నో స్కోరు 57 పరుగులకు చేరింది. అవుటయ్యే వరకు కూడా  ఏ దశలోనూ రాహుల్‌ స్ట్రయిక్‌రేట్‌ కనీసం 100 కూడా లేకపోవడం జట్టు అవకాశాలను దెబ్బ తీసింది.

 ఆ తర్వాత కొద్ది సేపటికే కృనాల్‌ రనౌట్‌ కావడంతో స్కోరు 66/4గా మారింది. ఇలాంటి స్థితిలో పూరన్, బదోని బ్యాటింగ్‌ లక్నో కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించింది. చివరి 5 ఓవర్లలో 63 పరుగులు రాగా... వీరిద్దరు 52 బంతుల్లోనే అభేద్యంగా 99 పరుగులు జోడించారు.  

మెరుపు వేగంతో... 
8, 17, 22, 17, 23, 20, 19, 17, 14, 10... ఛేదనలో సన్‌రైజర్స్‌ ఒక్కో ఓవర్‌లో చేసిన పరుగులు ఇవి. తొలి ఓవర్‌ మినహాయిస్తే ఎక్కడా తగ్గకుండా హెడ్, అభిషేక్‌ చెలరేగిపోయారు. యశ్‌ ఓవర్లో అభిషేక్‌ 4 ఫోర్లు కొట్టగా, గౌతమ్‌ ఓవర్లో హెడ్‌ 3 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు. నవీనుల్‌ ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 4 బాదిన హెడ్‌... ఈ క్రమంలో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

యశ్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టిన అభిషేక్‌ హాఫ్‌ సెంచరీ 19 బంతులకు పూర్తయింది. పవర్‌ప్లేలో 107 పరుగులు చేసిన రైజర్స్‌ ఆట ముగించేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. యశ్‌ వేసిన పదో ఓవర్‌ నాలుగో బంతిని అభిõÙక్‌ సిక్స్‌గా మలచడంతో ఉప్పల్‌ స్టేడియంలో సంబరాలు మొదలయ్యాయి.  

స్కోరు వివరాలు 
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) నటరాజన్‌ (బి) కమిన్స్‌ 29; డికాక్‌ (సి) నితీశ్‌ (బి) భువనేశ్వర్‌ 2; స్టొయినిస్‌ (సి) సన్వీర్‌ (బి) భువనేశ్వర్‌ 3; కృనాల్‌ పాండ్యా (రనౌట్‌) 24; పూరన్‌ (నాటౌట్‌) 48; బదోని (నాటౌట్‌) 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–13, 2–21, 3–57, 4–66. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–12–2, కమిన్స్‌ 4–0–47–1, షహబాజ్‌ 2–0–9–0, విజయకాంత్‌ 4–0–27–0, ఉనాద్కట్‌ 2–0–19–0, నటరాజన్‌ 4–0–50–0.  
సన్‌రైజర్స్‌ 

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (నాటౌట్‌) 75; హెడ్‌ (నాటౌట్‌) 89; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (9.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 167. బౌలింగ్‌: గౌతమ్‌ 2–0–29–0, యశ్‌ ఠాకూర్‌ 2.4–0–47–0, బిష్ణోయ్‌ 2–0–34–0, నవీనుల్‌ హక్‌ 2–0–37–0, బదోని 1–0–19–0.  

ఐపీఎల్‌లో నేడు
పంజాబ్‌ X  బెంగళూరు 
వేదిక: ధర్మశాల
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement