రోహిత్ శర్మతో రసెల్ (PC: IPL/BCCI)
తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పడంలో కరేబియన్ క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారు. ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి అతడు ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది.
కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత విరాహిత్ ద్వయం టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్-2023 తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబరులో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ విషయంపై పూర్తి స్పష్టత రానుంది.
ఈ నేపథ్యంలో హిందుస్తాన్ టైమ్స్‌తో సంభాషించిన ఆండ్రీ రసెల్‌కు రోహిత్, కోహ్లిల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. "అసలు రోహిత్, కోహ్లిల విషయంలో ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్ల నైపుణ్యాల గురించి చర్చలు పెట్టడం పరిపాటిగా మారిపోయింది.
రోహిత్ అనుభవజ్ఞుడైన ఆటగాడు.. ఇక విరాట్ విరాట్(బిగ్) ప్లేయర్ అని ప్రత్యేకంగా చెప్పేదేముంది? వీళ్లిద్దరిని గనుక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయకపోతే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు.
ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటం అత్యంత ముఖ్యం. యుద్ధ క్షేత్రానికి 11 మంది యువ సైనికులను పంపలేరు కదా! సీనియర్లకే కచ్చితంగా పెద్దపీట వేయాల్సి ఉంటుంది" అంటూ ఈ విండిస్ వీరుడు కుండబద్దలు కొట్టాడు.
యువ ఆటగాళ్లు ఇలాంటి మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని జయించలేక చిత్తవుతారు కాబట్టి.. అనుభవం ఉన్న ఆటగాళ్లను బరిలోకి దింపడం ముఖ్యమని రసెల్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్‌లో ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్!?
Comments
Please login to add a commentAdd a comment