టీమిండియా విజయం.. క్రెడిట్‌ మొత్తం మా వాళ్లకే: అక్తర్‌ | T20 WC Ind vs Pak: They Tried Their Best To Lose This Game: Shoaib Akhtar | Sakshi
Sakshi News home page

Ind vs Pak: టీమిండియా విజయం.. క్రెడిట్‌ మొత్తం మా వాళ్లకే: అక్తర్‌

Published Mon, Jun 10 2024 3:16 PM | Last Updated on Mon, Jun 10 2024 3:51 PM

T20 WC Ind vs Pak: They Tried Their Best To Lose This Game: Shoaib Akhtar

‘‘టీమిండియా విజయంలో క్రెడిట్‌ మొత్తం పాకిస్తాన్‌కే ఇవ్వాలి. ఓడిపోవడానికి అత్యుత్తమంగా ‌ప్రయత్నించారు. ఇంతకంటే గొప్పగా వాళ్ల గురించి చెప్పడానికి ఏమీ లేదు.

పాకిస్తాన్‌ మిడిలార్డర్‌ను గమనించారా? మిమ్మల్ని ఎవరూ షాట్లు ఆడమని అడుగలేదు. కనీసం చెత్త షాట్లు ఆడకుండా ఉంటే చాలని మాత్రమే కోరుకున్నాం.

కానీ మీరదే చేశారు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశారు. విజయం చేరువగా వచ్చినా.. మాకొద్దే వద్దు అన్నట్లు వెనక్కి నెట్టేశారు. ఇది నిజంగా షాకింగ్‌గా.. సర్‌ప్రైజ్‌గా ఉంది’’ అని పాకిస్తాన్‌ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ బాబర్‌ ఆజం బృందంపై విరుచుకుపడ్డాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో భాగంగా భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఆదివారం మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌ వేదికగా తలపడ్డ దాయాదుల పోరు ఆద్యంతం ఆసక్తి రేపింది.

తొలుత అద్భుత బౌలింగ్‌తో టీమిండియాను 119 పరుగులకే కట్టడిచేయగలిగిన పాకిస్తాన్‌.. లక్ష్య ఛేదనలో మాత్రం చేతులెత్తేసింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచి మరోసారి టీమిండియా చేతిలో భంగపాటుకు గురైంది. నిజానికి ఏ ఒక్క బ్యాటర్‌ కాసేపు ఓపికగా నిలబడినా ఫలితం వేరేలా ఉండేదేమో!

అయితే, టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ధాటికి పరుగులు రాబట్టలేక చతికిల పడ్డ పాక్‌ బ్యాటర్లు.. ఓటమిని చేజేతులా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 31 పరుగులతో పాక్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో వరుసగా బాబర్‌ ఆజం 13, ఉస్మాన్‌ ఖాన్‌ 13, ఫఖర్‌ జమాన్‌ 13, ఇమాద్‌ వసీం 15, షాబాద్‌ ఖాన్‌ 4, ఇఫ్తికార్‌ అహ్మద్‌ 5, షాహిన్‌ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు చేశారు.

చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement