టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌పై టీమిండియా మరోసారి పైచేయి సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని చాటుకుంటూ మెగా ఈవెంట్‌లో బాబర్ ఆజం బృందాన్ని ఓడించింది. తద్వారా వరల్డ్‌కప్-2024లో వరుసగా రెండో విజయం నమోదు చేసి గ్రూప్-ఏలో అగ్రస్థానం నిలబెట్టుకుంది.
ఇక ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడిన పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఓటమిపై స్పందించాడు.
మా ఓటమికి ప్రధాన కారణం అదే
టీమిండియా చేతిలో పరాజయానికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ‘‘మేము అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోవడం.. ఎక్కువగా డాట్ బాల్స్ కావడంతో వెనుకబడ్డాం.
స్ట్రైక్ రొటేట్ చేస్తూ నెమ్మదిగా పరుగులు రాబట్టాలనే ప్రయత్నం విఫలమైంది. తొలి ఆరు ఓవర్లలోనే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని భావించాం.
కానీ.. తొలి వికెట్ పడిన తర్వాత నుంచి మళ్లీ కోలుకోలేకపోయాం. నిజానికి పిచ్ బాగానే ఉంది. బంతి బ్యాట్ మీదకు వస్తోంది. వికెట్ కాస్త స్లోగా.. అదనపు బౌన్స్‌కు అనుకూలించింది.
వారి నుంచి ఎక్కువగా ఆశించకూడదు
అయినా.. పరుగుల కోసం టెయిలెండర్ల మీద ఆధారపడటం.. వారి నుంచి ఎక్కువగా ఆశించడం కూడా సరైంది కాదు’’ అని బాబర్ ఆజం తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు.
న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాను 119 పరుగులకే ఆలౌట్ చేసిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో 113 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆరు పరుగుల తేడాతో ఓడింది. పాక్ ఆటగాళ్లలో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
మిగిలిన వాళ్లలో వరుసగా బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫఖర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాబాద్ ఖాన్ 4, ఇఫ్తికార్ అహ్మద్ 5, షాహిన్ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు సాధించారు.
ఇంకో రెండు గెలిస్తేనే
కాగా గ్రూప్-ఏలో భాగమైన పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024లో తమ తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ చేతిలో అనూహ్య రీతిలో పరాజయం పాలైన బాబర్ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్ చేతిలోనూ ఓడిపోయింది.
ఈ క్రమంలో మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తేనే పాక్ ఈ టోర్నీలో ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘మా ఆట తీరులో లోపాలేమిటో కూర్చుని చర్చిస్తాం. ఇంకో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
వాటిలో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం’’ అని తెలిపాడు. కాగా పాకిస్తాన్ తదుపరి జూన్ 11న కెనడా, జూన్ 16న ఐర్లాండ్‌తో తలపడనుంది.
చదవండి: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
Comments
Please login to add a commentAdd a comment