T20 World Cup 2021 Aus Vs Sl: Australia Beat Sri Lanka By 7 Wickets - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021 Aus Vs SL: కప్‌ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్‌... వరుస విజయాలు

Published Fri, Oct 29 2021 7:28 AM | Last Updated on Fri, Oct 29 2021 10:34 AM

T20 World Cup 2021: Australia Beat Sri Lanka By 7 Wickets - Sakshi

ఆస్ట్రేలియా జోరు పెంచింది... పొట్టి ప్రపంచకప్‌లో తన స్థాయికి తగిన ప్రదర్శనతో గ్రూప్‌–1లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. కంగారూ ఓపెనర్లు ఫించ్, వార్నర్‌ లక్ష్యఛేదనలో చెలరేగిపోగా, అంతకంటే ముందు ఆడమ్‌ జంపా తన స్పిన్‌తో లంకను కట్టేశాడు. దీంతో ఆసీస్‌ అలవోక విజయంతో సెమీస్‌ బాటలో పడింది.  
     
T20 World Cup 2021: Australia Beat Sri Lanka By 7 Wickets: ఆస్ట్రేలియా ఇన్నేళ్లుగా తమకు అందని టి20 ప్రపంచకప్‌ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. తమ లక్ష్యాన్ని వరుస విజయాలతో ఘనంగా చాటి చెబుతోంది. దుబాయ్‌లో గురువారం జరిగిన గ్రూప్‌–1 లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై అలవోక విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కుశాల్‌ పెరీరా (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌), చరిత్‌ అసలంక (27 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు.

ఆస్ట్రేలియా స్పిన్నర్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆడమ్‌ జంపా (2/12) పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. తర్వాత ఆసీస్‌ 17 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌ (23 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), వార్నర్‌ (42 బంతుల్లో 65; 10 ఫోర్లు) చెలరేగారు. 

రాణించిన కుశాల్, అసలంక 
టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్‌ నిసంక (7) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వన్‌డౌన్‌లో వచి్చన అసలంకతో కలిసి ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరు కూడా బౌండరీలతో ధాటిగా ఆడారు. దీంతో లంక 5.4 ఓవర్లో 50 పరుగులు చేసింది. అయితే పదో ఓవర్లో ఎట్టకేలకు జంపా... అసలంక ఆట కట్టించాడు.

దీంతో 63 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత స్వల్ప వ్యవధిలో స్టార్క్‌... పెరిరా, హసరంగ (4)లను పెవిలియన్‌ చేర్చగా, అవిష్క ఫెర్నాండో (4)ను జంపా బోల్తా కొట్టించాడు. రాజపక్స (26 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అడపాదడపా బౌండరీలు బాదడంతో లంక స్కోరు 150 దాటింది.  

మెరిపించిన ఫించ్‌ 
ఆసీస్‌ లక్ష్యాన్ని వేగంగా ఛేదించే పనిలో పడింది. కెప్టెన్‌ ఫించ్‌ తొలి ఓవర్లో 2 బౌండరీలు బాదాడు. లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో ఫించ్, వార్నర్‌ ఎదురుదాడికి దిగారు. ఫించ్‌ ఫోర్, సిక్స్‌ కొట్టగా, వార్నర్‌ 2 ఫోర్లు బాదాడు. ఈ ఒక్క ఓవర్లోనే 20 పరుగులు వచ్చాయి. ఫించ్‌ క్రీజులో ఉన్నంతసేపూ ధనాధన్‌ కొనసాగించడంతో కంగారూ పది పైచిలుకు రన్‌రేట్‌తో దూసుకుపోయింది. 4.2 ఓవర్లోనే జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. చమీర వేసిన ఈ ఓవర్లో (5వ) వార్నర్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను కీపర్‌ కుశాల్‌ పెరీరా నేలపాలు చేశాడు. 

వార్నర్‌ ఫిఫ్టీ 
లైఫ్‌ దొరికిన తర్వాత వార్నర్‌ బాధ్యతగా ఆడాడు. బౌండరీలతో వేగం పెంచాడు. ఏడో ఓవర్లో ఫించ్‌ దూకుడుకు హసరంగ కళ్లెం వేశాడు. 70 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని ముగించిన ఈ స్పిన్నర్‌ తన మరుసటి ఓవర్లో డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ మ్యాక్స్‌వెల్‌ (5)ను బోల్తా కొట్టించాడు. కానీ వార్నర్‌ క్రీజులో పాతుకుపోవడం, స్మిత్‌ నిలకడగా ఆడటంతో లంకకు పట్టు బిగించే అవకాశమే చిక్కలేదు. 11వ ఓవర్లో ఆస్ట్రేలియా వంద పరుగులను అధిగమించింది. తర్వాత ఓవర్లోనే వార్నర్‌ 31 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీ కూడా పూర్తయ్యింది.

ఈ ఓపెనర్‌ చూడచక్కని ఫోర్లతో ఆసీస్‌ లక్ష్యంవైపుగా దూసుకెళ్లింది. ఇదే ఉత్సాహంతో షనక బౌలింగ్‌లో భారీ సిక్సర్‌కు ప్రయతి్నంచిన వార్నర్‌ లాం గాఫ్‌లో రాజపక్సకు చిక్కా డు. 130 స్కోరు వద్ద నిష్క్రమించాడు. అప్పటికే ఆసీస్‌ లక్ష్యానికి చేరువైంది. 30 బంతుల్లో 25 పరుగుల లాంఛనాన్ని స్టీవ్‌ స్మిత్‌ (26 బంతుల్లో 28 నాటౌట్‌; 1 ఫోర్‌), స్టొయినిస్‌ (7 బంతు ల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పూర్తి చేశారు. 

స్కోరు వివరాలు 
శ్రీలంక ఇన్నింగ్స్‌: నిసంక (సి) వార్నర్‌ (బి) కమిన్స్‌ 7; కుశాల్‌ పెరీరా (బి) స్టార్క్‌ 35; అసలంక (సి) స్మిత్‌ (బి) జంపా 35; అవిష్క ఫెర్నాండో (సి) స్మిత్‌ (బి) జంపా 4; రాజపక్స (నాటౌట్‌) 33; హసరంగ (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 4; షనక (సి) వేడ్‌ (బి) కమిన్స్‌ 12; కరుణరత్నే (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154.  
వికెట్ల పతనం: 1–15, 2–78, 3–86, 4–90, 5–94, 6–134. బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–27–2, హాజల్‌వుడ్‌ 4–0–26–0, కమిన్స్‌ 4–0–34–2, మ్యాక్స్‌వెల్‌ 1–0–16–0, స్టొయినిస్‌ 3–0–35–0, జంపా 4–0–12–2. 
 

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాజపక్స (బి) షనక 65; ఫించ్‌ (బి) హసరంగ 37; మ్యాక్స్‌వెల్‌ (సి) ఫెర్నాండో (బి) హసరంగ 5; స్మిత్‌ (నాటౌట్‌) 28; స్టొయినిస్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 155.
వికెట్ల పతనం: 1–70, 2–80, 3–130. బౌలింగ్‌: కరుణరత్నే 2–0–19–0, తీక్షణ 4–0–27–0, చమీర 3–0–33–0, లహిరు కుమార 3–0–48–0, హసరంగ 4–0–22–2, షనక 1–0–6–1.   

చదవండి: David Warner: టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున తొలి బ్యాటర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement