T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ... | T20 World Cup 2024: India beat Ireland by eight wickets | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఆడుతూ పాడుతూ...

Published Thu, Jun 6 2024 4:01 AM | Last Updated on Thu, Jun 6 2024 1:12 PM

T20 World Cup 2024: India beat Ireland by eight wickets

తొలి మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం

 8 వికెట్లతో ఐర్లాండ్‌ చిత్తు

రాణించిన బౌలర్లు, రోహిత్‌

ఆదివారం పాకిస్తాన్‌తో ‘ఢీ’   

భారీ అంచనాలతో టి20 వరల్డ్‌ కప్‌ బరిలోకి దిగిన భారత్‌ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్‌పై ఏమాత్రం ఉదాసీనత కనబర్చకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. 

బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై ప్రత్యరి్థని 96 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తర్వాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేరింది. మన బౌలర్లలో ఐదుగురు కనీసం ఒక్కో వికెట్‌తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్, పంత్‌ చక్కటి బ్యాటింగ్‌ టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాయి. ఇక ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌ రూపంలో తర్వాతి సవాల్‌కు భారత్‌ సిద్ధమైంది.   

న్యూయార్క్‌: టి20 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ బృందం శుభారంభం చేసింది. బుధవారం నాసా కౌంటీ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. గారెన్‌ డెలానీ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)దే అత్యధిక స్కోరు. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జస్‌ప్రీత్‌ బుమ్రా (2/6), అర్‌‡్షదీప్‌ చెరో 2 వికెట్లు తీయగా, హార్దిక్‌ పాండ్యాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 12.2 ఓవర్లలో 2 వికెట్లకు 97 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్‌ శర్మ (37 బంతుల్లో 52 రిటైర్డ్‌హర్ట్‌; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌ (26 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 44 బంతుల్లో 54 పరుగులు జోడించారు.  

టపటపా... 
స్వింగ్‌కు అనుకూల వాతావరణం, అనూహ్య బౌన్స్, నెమ్మదైన అవుట్‌ఫీల్డ్‌... ఇలాంటి స్థితిలో బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ ఏ దశలోనూ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. మూడో ఓవర్లో కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (2), బల్బర్నీ (5)లను అవుట్‌ చేసి అర్‌‡్షదీప్‌ ముందుగా దెబ్బ కొట్టడంతో మొదలైన ఐర్లాండ్‌ పతనం వేగంగా సాగింది. పవర్‌ప్లేలో 26 పరుగులు రాగా, వాటిలో 9 ఎక్స్‌ట్రాలే ఉన్నాయి. 

పాండ్యా తన తొలి రెండు ఓవర్లలో టకర్‌ (10), కాంఫర్‌ (12)లను వెనక్కి పంపించగా, టెక్టర్‌ (4)ను బుమ్రా అవుట్‌ చేశాడు. సిరాజ్‌ ఖాతాలో డాక్‌రెల్‌ (3) వికెట్‌ చేరడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్‌ 49/6 వద్ద నిలిచింది. అక్షర్‌ పటేల్‌ కూడా తన తొలి ఓవర్లో మెక్‌కార్తీ (0) పని పట్టగా, బుమ్రా బౌలింగ్‌లో లిటిల్‌ (14) బౌల్డయ్యాడు. అయితే చివర్లో డెలానీ కొన్ని పరుగులు జోడించగలిగాడు. అర్‌‡్షదీప్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతను అదే ఓవర్‌ చివరి బంతికి రనౌట్‌ కావడంతో ఐర్లాండ్‌ ఆట ముగిసింది.  

ఆకట్టుకున్న పంత్‌... 
ఓపెనర్‌గా వచి్చన విరాట్‌ కోహ్లి (1) ప్రభావం చూపలేకపోగా, మరోవైపు రోహిత్‌ ధాటిగా ఆడాడు. మూడో స్థానంలో బరిలోకి దిగిన పంత్‌ కూడా అదే తరహాలో వేగంగా బ్యాటింగ్‌ చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. లిటిల్‌ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లతో జోరు పెంచిన రోహిత్‌ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అంతకుముందు లిటిల్‌ వేసిన ఓవర్లో బంతి భుజానికి బలం తగిలిన కారణంగా నొప్పితో మైదానం వీడాడు. 21 పరుగులు చేయాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు వచి్చన సూర్యకుమార్‌ (2) విఫలమైనా... మెక్‌కార్తీ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌ సిక్సర్‌తో పంత్‌ మ్యాచ్‌ ముగించాడు. ఇటీవలే ఐపీఎల్‌లో ఆడిన పంత్‌కు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.  

స్కోరు వివరాలు  
ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: బల్బర్నీ (బి) అర్‌‡్షదీప్‌ 5; స్టిర్లింగ్‌ (సి) పంత్‌ (బి) అర్‌‡్షదీప్‌ 2; టకర్‌ (బి) పాండ్యా 10; టెక్టర్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్‌ (సి) పంత్‌ (బి) పాండ్యా 12; డాక్‌రెల్‌ (సి) బుమ్రా (బి) సిరాజ్‌ 3; డెలానీ (రనౌట్‌) 26; అడెయిర్‌ (సి) దూబే (బి) పాండ్యా 3; మెక్‌కార్తీ (సి అండ్‌ బి) అక్షర్‌ 0; లిటిల్‌ (బి) బుమ్రా 14; వైట్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16 ఓవర్లలో ఆలౌట్‌) 96. 
వికెట్ల పతనం: 1–7, 2–9, 3–28, 4–36, 5–44, 6–46, 7–49, 8–50, 9–77, 10–96. 
బౌలింగ్‌: అర్‌‡్షదీప్‌ 4–0–35–2, సిరాజ్‌ 3–0–13–1, బుమ్రా 3–1–6–2, పాండ్యా 4–1–27–3, అక్షర్‌ పటేల్‌ 1–0–3–1, జడేజా 1–0–7–0. 
 

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (రిటైర్డ్‌హర్ట్‌) 52; కోహ్లి (సి) వైట్‌ (బి) అడెయిర్‌ 1; పంత్‌ (నాటౌట్‌) 36; సూర్యకుమార్‌ (సి) డాక్‌రెల్‌ (బి) వైట్‌ 2; దూబే (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–22, 2–91. 
బౌలింగ్‌: అడెయిర్‌ 4–0–27–1, లిటిల్‌ 4–0–42–0 మెక్‌కార్తీ 2.2–0–8–0, కాంఫర్‌ 1–0–4–0, వైట్‌ 1–0–6–1.  

600: 600 రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ టెస్టుల్లో 84, వన్డేల్లో 323, టి20ల్లో 193 సిక్స్‌లు బాదాడు.  

4000:  రోహిత్‌ అంతర్జాతీయ టి20ల్లో 4 వేల పరుగులు (4026) దాటాడు. కోహ్లి (4038), బాబర్‌ (4023) తర్వాత ఈ మైలురాయిని చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement