
2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు వరుస శుభసూచకాలు ఎదురవుతున్నాయి. 2011 వరల్డ్‌కప్ లాగా ఈసారి కూడా మెగా టోర్నీ భారత్‌లోనే జరుగుతుండటం మొదటి శుభసూచకమైతే.. రెండోది టీమిండియా ఆటగాళ్ల అరివీర భయంకరమైన ఫామ్. ఈ రెంటితో పాటు భారత్‌కు తాజాగా మరో శుభసూచకం కూడా ఎదురైంది.
అదేంటంటే.. ఈసారి భారత్ ప్రపంచ నంబర్ వన్ జట్టుగా బరిలోకి దిగనుండటం. ప్రపంచ నంబర్ వన్ జట్టైనంత మాత్రాన భారత్ వరల్డ్‌కప్ ఎలా గెలుస్తుందని చాలామందికి సందేహం కలగవచ్చు. అయితే ఇది చూడండి..
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్ వన్ వన్డే జట్టుగా ఆవతరించిన విషయం తెలిసిందే. వన్డేలతో పాటు భారత్ మూడు ఫార్మాట్లలోనూ టాప్ జట్టుగా కొనసాగుతుంది. ఆసీస్‌పై తొలి వన్డేలో విజయంతో భారత్ ఈ అరుదైన ఘనతను సాధించింది. వరల్డ్ నంబర్ వన్ జట్టు హోదాలోనే భారత్ ప్రపంచకప్ బరిలోకి కూడా దిగనుంది.
చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. గత రెండు వన్డే వరల్డ్‌కప్‌ల్లో నంబర్ వన్ జట్లుగా బరిలోకి దిగిన జట్లే జగజ్జేతలుగా ఆవిర్భవించాయి. 2015 వరల్డ్‌కప్‌లో నంబర్ వన్ టీమ్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఐదోసారి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించగా.. 2019 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ కూడా నంబర్ వన్ వన్డే జట్టుగా బరిలోకి దిగి తమ తొలి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
అంతకుముందు 2003, 2007 ఎడిషన్లలో కూడా ఆస్ట్రేలియా నంబర్ వన్ వన్డే జట్టుగా వరల్డ్‌కప్ బరిలోకి దిగి టైటిల్ చేజిక్కించుకుంది.ఈ లెక్కన ఈసారి నంబర్ వన్ వన్డే జట్టుగా రంగంలోకి దిగుతున్న భారత్.. వన్డే ప్రపంచకప్‌కు ముచ్చటగా మూడోసారి ముద్దాడటం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.