టీమిండియా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) మద్దతు పలికాడు. వీరిద్దరు మరో రెండేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతారని అంచనా వేశాడు. ఇప్పటికే తామేంటో ‘విరాహిత్’ ద్వయం నిరూపించుకున్నారని.. కొత్తగా వాళ్లు చేయాల్సిందేమీ లేదని పేర్కొన్నాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్న ఈ ఇద్దరు గత కొన్నినెలలుగా రోహిత్-విరాట్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్‌లో రోహిత్, కోహ్లి విఫలమవుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఇక ఆటకు సెలవిచ్చి యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లూ వినిపించాయి. ఇక టీ20 రిటైర్మెంట్ తర్వాత వీరిద్దరు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రమే పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఇంగ్లండ్‌తో వన్డేలకు సిద్ధమయ్యారు.
సొంతగడ్డపై జరగుతున్న ఈ సిరీస్ అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి బిజీ అవుతారు. ఈ మ్యాచ్‌లలో వీరి ఆట తీరు ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మరో రెండేళ్లు టీమిండియాకు ఆడతారు
‘‘ఎవరి ముందు వీరు ఇంకా నిరూపించుకోవాల్సిందేమీ ఏమీలేదు. ఇద్దరూ దిగ్గజాలే. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నారు. వారి వయసు 36- 37. అయినా సరే.. మరో రెండేళ్ల పాటు టీమిండియా తరఫున కొనసాగ గల సత్తా వారికి ఉంది.
ఇక కోహ్లి విషయానికొస్తే.. భారత్ తరఫున అత్యుత్తమ చేజింగ్ కింగ్ అతడే. అంతేకాదు.. ప్రపంచంలో అతడి లాంటి ఆటగాడు మరొకరు లేరు. చేజింగ్‌లో దేశానికి ఇన్ని విజయాలు సాధించి పెట్టినవారూ లేరు. అతడు ఫామ్‌లోకి వచ్చాడంటే.. ఎవరూ ఆపలేరు.
కోహ్లి- రోహిత్ ఆటను చూస్తే ముచ్చటేస్తుంది. రోహిత్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత అతడు ఎదిగిన తీరు అమోఘం’’ అని పీటర్సన్ కొనియాడాడు. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నాగ్‌పూర్ వేదికగా వన్డే సిరీస్ మొదలుకానుంది. కటక్ వేదికగా ఫిబ్రవరి 9న రెండో వన్డే, అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 12న మూడో వన్డే జరుగుతుంది.
ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు టీమిండియా
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.
భారత్‌తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. ఫిబ్రవరి 20న రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. తటస్థ వేదికైన దుబాయ్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక దాయాది పాకిస్తాన్‌తో ఫిబ్రవరి 23న మ్యాచ్ ఆడనున్న భారత్.. లీగ్ దశలో ఆఖరిగా మార్చి రెండున న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment