గువహటి: రాజస్తాన్ రాయల్స్ తొలి ఓవర్లో 5 ఫోర్లతో 20/0...ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓవర్లో ‘సున్నా’కు 2 వికెట్లు...ఇరు జట్ల మధ్య స్పష్టంగా కనిపించిన తేడా! ఆరంభంనుంచే జోరు ప్రదర్శించిన రాయల్స్ చివరి వరకు దానిని కొనసాగించగా...ఛేదనలో మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ మళ్లీ కోలుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టుకు వరుసగా మూడో పరాజయం తప్పలేదు.
శనివారం బర్సపర స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 57 పరుగుల తేడాతో ఢిల్లీపై ఘన విజయం సాధించింది. రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా, ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (31 బంతుల్లో 60; 11 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (51 బంతుల్లో 79; 11 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆరంభం అందించారు.
ఖలీల్ వేసిన తొలి ఓవర్లో యశస్వి 5 ఫోర్లతో చెలరేగగా, నోర్జే వేసిన తర్వాతి ఓవర్లో బట్లర్ 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత అక్షర్ ఓవర్లోనూ యశస్వి 3 ఫోర్లు బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 68/0. ఇందులో 56 పరుగులు 14 ఫోర్లతోనే రావడం విశేషం. 25 బంతుల్లోనే యశస్వి అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు 98 పరుగుల భాగస్వామ్యం (51 బంతుల్లో) యశస్వి వెనుదిరగ్గా, సామ్సన్ (0), పరాగ్ (7) తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. అయితే చివర్లో షిమ్రాన్ హెట్‌మైర్ (21 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపులు రాయల్స్‌కు భారీ స్కోరును అందించాయి.
ఛేదనలో డేవిడ్ వార్నర్ (55 బంతుల్లో 65; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, క్యాపిటల్స్ విజయానికి అది సరిపోలేదు. వార్నర్‌తో పాటు లలిత్ యాదవ్ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించగా, మిగతావారంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ మ్యాచ్‌లోలాగే ఈ సారి కూడా బౌల్ట్ తన అద్భుత బౌలింగ్‌తో తొలి ఓవర్లోనే 2 వికెట్లు పడగొట్టాడు. పృథ్వీ షా (0), మనీశ్ పాండే (0) డకౌట్ కాగా, రోసో (14) కూడా ఆరు ఓవర్ల లోపే అవుట్ కావడంతో ఢిల్లీ ఛేదన కష్టంగా మారిపోయింది.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) అండ్ (బి) ముకేశ్ 60; బట్లర్ (సి) అండ్ (బి) ముకేశ్ 79; సామ్సన్ (సి) నోర్జే (బి) కుల్దీప్ 0; పరాగ్ (బి) పావెల్ 7; హెట్‌మైర్ (నాటౌట్) 39; జురేల్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–98, 2–103, 3–126, 4–175. బౌలింగ్: ఖలీల్ 2–0–31–0, నోర్జే 4–0–44–0, ముకేశ్ కుమార్ 4–0–36–2, అక్షర్ 4–0–38–0, కుల్దీప్ 4–0–31–1, పావెల్ 2–0–18–1.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; వార్నర్ (ఎల్బీ) (బి) చహల్ 65; మనీశ్ పాండే (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; రోసో (సి) యశస్వి (బి) అశ్విన్ 14; లలిత్ యాదవ్ (బి) బౌల్ట్ 38; అక్షర్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 2; పావెల్ (సి) హెట్‌మైర్ (బి) అశ్విన్ 2; పోరెల్ (సి) హెట్‌మైర్ (బి) చహల్ 7; కుల్దీప్ (నాటౌట్) 3; నోర్జే (బి) సందీప్ 0; ముకేశ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1–0, 2–0, 3–36, 4–100, 5–111, 6–118, 7–138, 8–139, 9–140.
బౌలింగ్: బౌల్ట్ 4–1–29–3, సందీప్ 4–0–20–1, ఆర్. అశ్విన్ 4–0–25–2, హోల్డర్ 3–0–28–0, చహల్ 4–0–27–3, మురుగన్ అశ్విన్ 1–0–11–0.
Comments
Please login to add a commentAdd a comment