IPL 2023 RR VS DC: Trent Boult Picked 2 Wickets In First Over Vs SRH And DC - Sakshi
Sakshi News home page

RR VS DC: ట్రెంట్‌ బౌల్ట్‌ ఉగ్రరూపం.. సన్‌రైజర్స్‌పై ఎలాగో ఢిల్లీపై కూడా..!

Published Sat, Apr 8 2023 6:28 PM | Last Updated on Sat, Apr 8 2023 7:07 PM

RR VS DC: Boult Picked 2 Wickets In First Over Vs SRH And DC - Sakshi

PIC Credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా గౌహతి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్డ్‌ ఉగ్రరూపం దాల్చాడు. నిప్పులు చెరిగే బంతులతో తొలి ఓవర్‌ సంధించిన బౌల్ట్‌ పరుగులేమీ ఇవ్వకుండా 2 వికెట్లు పడగొట్టాడు. మూడో బంతికి పృథ్వీ షా (0) ఔట్‌ చేసిన అతను.. ఆ మరుసటి బంతికే మనీశ్‌ పాండే (0) ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపాడు.

ఇక్కడ ఆసక్తికర మరో అంశం ఏమిటంటే.. ఈ సీజన్‌లో ఆర్‌ఆర్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనూ బౌల్ట్‌ ఇలాగే తొలి ఓవర్‌లో 2 వికెట్లు పడగొట్టి బెంబేలెత్తించాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. డీసీపై లాగే భారీ స్కోర్‌ (203/5) సాధించింది. అప్పుడు కూడా భారీ లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ను బౌల్ట్‌ తన పేస్‌ పదునుతో గడగడలాడించాడు.

డీసీపై లాగే ఆ మ్యాచ్‌లోనూ బౌల్ట్‌ తొలి ఓవర్‌లోనే పరుగులేమీ ఇవ్వకుండా 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైతే ఓపెనర్లలో ఒకరు (షా), వన్‌డౌన్‌ బ్యాటర్‌ (మనీశ్‌) డకౌట్‌ అయ్యారో, సన్‌రైజర్స్‌‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (0), వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి (0)  కూడా అలాగే డకౌటయ్యారు. సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎలాగైతే మూడో బంతికి ఔటయ్యాడో, డీసీ ఓపెనర్‌ పృథ్వీ షా కూడా మూడో బంతికే ఔటయ్యాడు.

డీసీతో మ్యాచ్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ మనీశ్‌ పాండే గోల్డెన్‌ డకౌట్‌ (తొలి బంతికే ఔట్‌) కాగా, సన్‌రైజర్స్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ త్రిపాఠి మాత్రం ఓ బంతి ఆగి రెండో బంతికి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇదొక్క తేడా తప్పించి సన్‌రైజర్స్‌పై తొలి ఓవర్‌లో ఎలాగైతే చెలరేగాడో.. ప్రస్తుతం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ బౌల్ట్‌ అలాగే విజృంభించాడు. ఈ పోలిక చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. బౌల్ట్‌కు సలాం​ కొడుతున్నారు. ఉపఖండపు పిచ్‌లపై ఓ పేసర్‌ ఇలా రెచ్చిపోవడమేంటని ముక్కున వెళ్లేసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. ఓపెనర్లు యశస్వి (60), బట్లర్‌ (79) మెరుపు అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆఖర్లో హెట్‌మైర్‌ (39 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. డీసీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 2, కుల్దీప్‌, రోవ్‌మన్‌ పావెల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ట్రెంట్‌ బౌల్డ్‌ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 10 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 68/3గా ఉంది. వార్నర్‌ (33), లలిత్‌ యాదవ్‌ (16) క్రీజ్‌లో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement