నేడు మహిళల టి20 వరల్డ్ కప్‌లో కీలక సమరం
విజయమే లక్ష్యంగా హర్మన్ బృందం
మధ్యాహ్నం 3:30 నుంచి స్టార్‌స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రసారం
దుబాయ్: ఒకే ఒక్క పరాజయం... భారీ తేడాతో ఎదురైన చేదు ఫలితం... ఇప్పుడు భారత మహిళల జట్టుకు టి20 ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌లోనూ అగ్నిపరీక్ష పెట్టబోతోంది. నేడు జరిగే మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌తో తలపడుతున్న హర్మన్‌ప్రీత్ సేన బోణీ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత్‌తో పోల్చుకుంటే పాక్ పెద్ద పోటీ జట్టు కాదు. కానీ ఇది పొట్టి ఫార్మాట్! ఏదైనా జరగొచ్చు.
ఈ నేపథ్యంలో నిలకడ లోపించిన హర్మన్‌సేన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా లాంటి గట్టి ప్రత్యర్థిని ఎదుర్కొనే ముందు తప్పకుండా పాక్‌ను భారీ తేడాతో మట్టికరిపించాల్సివుంటుంది. అప్పుడే కివీస్‌తో తొలి మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఎదురైన ఓటమి ప్రభావం కనిపించకుండా ముందంజ వేసేందుకు కనీస అవకాశాలు ఉంటాయి. పైగా ఈ గ్రూప్ ‘ఎ’లో కివీస్, ఆసీస్, పాక్ విజయాలతో ఉంటే వరుస పరాజయాలతో శ్రీలంక రేసుకు దూరమైంది.
ఇప్పుడు రేసులో నిలవాలంటే భారత జట్టు పాక్, లంకలపై భారీ విజయాలు సాధించాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని హర్మన్‌సేన్ వెంటనే తమ లోపాలను సరిదిద్దుకొని ముందడుగు వేయాలి. ముఖ్యంగా నిలకడ లోపించిన బ్యాటింగ్ ఆర్డర్ గాడిన పడాలి. ఓపెనర్లు షఫాలీ, స్మృతిలు మెరుపు ఆరంభం అందిస్తే మూడో స్థానంలో ఉన్న హర్మన్ కౌర్ దానిని కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జెమీమా, రిచా ఘోష్ కీలకం కానున్నారు.
కివీస్‌తో మ్యాచ్‌లో ఒక అదనపు బౌలర్‌ను తీసుకోవడంతో బ్యాటింగ్ మరీ బలహీనంగా మారిపోయింది. దీనిని బట్టి ఈ మ్యాచ్ కోసం వ్యూహాల్లో మార్పు ఉండవచ్చు. బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించాలి. ప్రతి మ్యాచ్‌లోనూ సమష్టిగా పోరాడితేనే భారత్ ఈ గ్రూపు నుంచి నాకౌట్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు లంకను ఓడించిన పాకిస్తాన్‌కు భారత్ క్లిష్టమైన ప్రత్యర్థే!
అలాంటి జట్టుపై గెలిస్తే మాత్రం ప్రపంచకప్ గెలిచినంత సంబరం గ్యారంటీ. దీంతో గెలిచేందుకు పాక్ శక్తికి మించిన పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ప్రేక్షకుల కూడా పెద్ద సంఖ్యలో ఈ మహిళల మ్యాచ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పోరు కోసం 12 వేల టికెట్లు అమ్ముడవడం విశేషం.
తుది జట్లు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, రిచా, దీప్తి, అరుంధతి, పూజ, శ్రేయాంక, ఆశ శోభన, రేణుక.
పాకిస్తాన్: ఫాతిమా సన (కెప్టెన్), మునీబా, గుల్ ఫిరోజా, సిద్రా అమిన్, ఒమైమా, నిదా దర్, తుబా హసన్, అలియా, దియాన బేగ్, నష్రా సంధు, సాదియా.
Comments
Please login to add a commentAdd a comment