ధోనితో రిషభ్ పంత్(ఫైల్ ఫొటో PC: BCCI)
Rishabh Pant Comments On MS Dhoni: టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేనని యువ క్రికెటర్ రిషభ్ పంత్ అన్నాడు. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటన గురించి మహీ భయ్యాతో కచ్చితంగా పంచుకుంటానని తెలిపాడు. అయితే, ధోనితో తన ఆట తీరును పోల్చడం మాత్రం తనకు నచ్చదంటూ పంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
కాగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతికాలంలోనే పంత్.. ధోని వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు. అయితే, మిస్టర్ కూల్ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు ఇతడేనంటూ ప్రశంసలు కురిపించిన వాళ్లే.. పంత్ విఫలమైన సమయంలో దారుణమైన విమర్శలు చేశారు.
రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేవాడిని
ఇలాంటి పోలికలు, విమర్శలు తన మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపేవంటున్నాడు రిషభ్ పంత్. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అసలు ధోని భయ్యాతో నన్నెందుకు పోల్చి చూస్తారో అర్థమే కాదు. ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిన 500 మ్యాచ్‌లు ఆడిన దిగ్గజంతో కంపేర్ చేయడంలో అర్థముందా?
ఆరోజు అందరూ ధోని పేరును జపిస్తూ..
ఇలాంటి పోలికల వల్ల నేను చాలాసార్లు బాధపడ్డాను. ఒత్తిడిని తట్టుకోలేక గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉండేవాడిని. ఓసారి మొహాలీలో మ్యాచ్‌లో నేను స్టంప్ మిస్ చేయగానే అందరూ ధోని ధోని అని అంటూ భయ్యా నామస్మరణ చేశారు.
అప్పుడు నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మాటల్లో చెప్పలేను’’ అని రిషభ్ పంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆట పరంగా ఇలాంటి పోలికలు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చినా.. ధోనితో వ్యక్తిగతంగా తన అనుబంధం ఎంతో గొప్పదని పంత్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
ఇలా ఉన్నానంటే.. అంతా ధోని వల్లే
ధోని దగ్గర ఎలాంటి విషయాలనైనా చర్చించగల చనువు తనకు ఉందని తెలిపాడు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘ఐపీఎల్‌లో వికెట్ కీపింగ్ చేసినపుడు కంటే టీమిండియాకు ఆడినపుడు ఎక్కువగా ఒత్తిడిలో కూరుకుపోతున్నాను భయ్యా అని ఓసారి ధోనికి చెప్పాను.
అప్పుడాయన.. మరేం పర్లేదు.. అంతర్జాతీయ మ్యాచ్ అన్న విషయం మర్చిపోయి లీగ్ మ్యాచ్ ఆడినట్లే స్వేచ్ఛగా ఆడు అని చెప్పాడు. నేను వెంటనే అందుకు బదులిస్తూ.. ‘‘నువ్వు లెజెండ్ భయ్యా.
అయితే, ఒక్కోసారి నాపై భారం వేసి నువ్వు మాత్రం రిలాక్స్ అవుతావు. ఇది చాలా అన్యాయం అని వాదించేవాడిని’’ పంత్ చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 2022లో కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ పంత్.. ఐపీఎల్-2024తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
చదవండి: Ind vs Eng: తుదిజట్టులో నో ఛాన్స్!.. సర్ఫరాజ్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment