![Virat Kohli Cant Be Replaced Says Sunil Gavaskar - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/1/Untitled-5%20copy.jpg.webp?itok=g3ZtE7_6)
Virat Kohli Cant Be Replaced Says Sunil Gavaskar: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన టీమిండియా టాపార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, ఇటీవలి కాలంలో అశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సరైన రీప్లేస్‌మెంట్ అంటూ క్రికెట్ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తున్న వేళ.. ఈ ఇద్దరి మధ్య పోటీపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు.
కెరీర్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న శ్రేయస్‌ను స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో పోల్చడం, పోటీపెట్టడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. ఫార్మాట్ ఏదైనా టీమిండియాలో కోహ్లి స్థానానికి ఎవ్వరూ పోటీ కారు, కాలేరని పేర్కొన్నాడు. కోహ్లి శతక దాహంతో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, జట్టులో నుంచి తప్పించే స్థాయి పేలవ ప్రదర్శనేమీ చేయడంలేదని టీమిండియా మాజీ కెప్టెన్‌ను వెనకేసుకొచ్చాడు. జట్టులో కోహ్లి స్థానం కోసం పోటీ నెలకొనడం శుభపరిణామమేనని, ఘన చరిత్ర కలిగిన కోహ్లిని తక్కువ అంచనా వేయడం సబబు కాదని కోహ్లి విమర్శకులకు చురకలంటించాడు.
టీ20ల్లో కోహ్లి వన్‌డౌన్‌లోనే రావాలని, శ్రేయస్‌ను నాలుగు, లేదా ఐదో స్థానంలో బరిలోకి దించడం శ్రేయస్కరమని సూచించాడు. కోహ్లి, శ్రేయస్‌ల పోటీ విషయం పక్కన పెడితే, ఇటీవలి కాలంలో సూర్యకుమార్ యాదవ్ కూడా అదరగొడుతున్నాడని, తుది జట్టులో స్థానం కోసం అతనికి శ్రేయస్‌కు మధ్యే పోటీ ఉంటుందని తెలిపాడు. కాగా, టీ20ల్లో శ్రేయస్‌ను కోహ్లి రెగ్యులర్ స్థానమైన వన్‌డౌన్‌లో ఆడించి.. కోహ్లిని రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయిస్తే బెటర్ అంటూ టీమిండియా అభిమానుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ నుంచి స్వచ్చందంగా తప్పుకుని విరామంలో ఉన్న కోహ్లి మార్చి 4 నుంచి లంకతోనే ప్రారంభంకానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ కోహ్లి కెరీర్‌లో 100వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం.
చదవండి: 'కోహ్లిపై కోపం తగ్గలేదా'.. బీసీసీఐని ఏకిపారేసిన క్రికెట్ ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment