‘అందుకే ఆర్సీబీ ఓడిపోతోంది.. అంతేనా కోహ్లి’ | Virat Kohli Gets Trolled On His Diwali Messages RCB Gives Clarification | Sakshi
Sakshi News home page

కోహ్లిపై ట్రోలింగ్‌.. ఆర్సీబీ వివరణ

Published Tue, Nov 17 2020 8:41 PM | Last Updated on Tue, Nov 17 2020 8:47 PM

Virat Kohli Gets Trolled On His Diwali Messages RCB Gives Clarification - Sakshi

బెంగళూరు: ‘‘కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా దీపావళి జరుపుకొని ఉంటారని భావిస్తున్నాం. మా తరఫున ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాం. ఇటీవల ఆర్‌సీబీ షేర్‌ చేసిన వీడియోలో కనిపించిన ఫైర్‌వర్క్స్‌ ఫుటేజీ.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఫ్లాగ్‌డే వేడులకు సంబంధించినది. ఆర్‌సీబీ ఎన్నో ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది. ఎల్లప్పుడూ ఇదే విధానాన్ని కొనసాగిస్తుంది’’ అంటూ ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ప్రకటన విడుదల చేసింది. టపాసులు కాల్చవద్దంటూ ఆ జట్టు సారథి, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి షేర్‌ చేసిన వీడియోపై ట్రోలింగ్‌ జరిగిన నేపథ్యంలో ఈ మేరకు ట్విటర్‌ వేదికగా సోమవారం వివరణ ఇచ్చింది.

కాగా దీపావళి పండుగను పురస్కరించుకుని.. ‘‘ అందరికీ పండుగ శుభాకాంక్షలు. దయచేసి ఎవరూ టపాసులు కాల్చవద్దు. పర్యావరణాన్ని కాపాడండి. దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకుంటూ పండుగ సమయాన్ని ఆస్వాదించండి’’ అంటూ కోహ్లి ఓ సందేశాన్ని విడుదల చేశాడు. ఈ క్రమంలో కోహ్లిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు.. ‘‘మీరు మాత్రం మీ పుట్టినరోజున క్రాకర్స్‌ పేలుస్తున్న ఫొటోలు షేర్‌ చేస్తారు. మాకేమో కాలుష్యం అంటూ కబుర్లు చెప్తారు. ఏదైనా మీరు ఆచరించిన తర్వాతే మాకు చెప్పండి. అంతేగానీ ఉచిత సలహాలు వద్దు’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కోహ్లి పుట్టినరోజున అతడి విషెస్‌ చెబుతూ ఆర్‌సీబీ షేర్‌ చేసిన ఫొటోలే ఇందుకు కారణం.(చదవండి: కోహ్లి లేకపోతే టీమిండియాకు కష్టమే)

ఇక ఇదిలా ఉంటే.. ఆర్‌సీబీ ఆటగాడు శివం దూబే టపాసులు కాలుస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ‘‘కెప్టెన్‌ మాటను ఒక్కరూ పట్టించుకోరు. అందుకే ఆర్సీబీ ఒక్కసారి కూడా ట్రోఫీ సాధించలేక పోయింది’’ అంటూ మరో వర్గం కోహ్లి అండ్‌ టీంపై ట్రోలింగ్‌కు దిగింది. కాగా గత మూడు సీజన్లలో ఘోర పరాభవం పాలైన(ఎనిమిది, ఆరు, ఎనిమిది స్థానాల్లో) నిలిచిన బెంగళూరు జట్టు ఈసారి కొంత మేర అభిమానులను ఆకట్టుకుంది. నాలుగో స్థానంతో ఐపీఎల్‌-2020 సీజన్‌ను ముగించినప్పటికీ, తొలి సీజన్‌ నుంచి అభిమానులు ఆశిస్తున్న టైటిల్‌ కోరికను మాత్రం నెరవేర్చలేక మరోసారి చేతులు ఎత్తేసింది. దీంతో, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌గా, టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న కోహ్లి.. ఐపీఎల్‌ నాయకత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి‘ఏంటిది కోహ్లి.. ధోనిలా ఆలోచించలేవా?!’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement