‘‘ఈ విషయం నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. నిజానికి మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటేషన్ సెర్మనీ సమయంలోనే ఈ ప్రకటన వస్తుందని ఊహించాను. సిరీస్ కోల్పోయామనే ఆవేశంలో అక్కడిక్కడే ప్రకటన వస్తుందనుకున్నా. కానీ.. కొంచెం గ్యాప్ తర్వాత ఈ నిర్ణయానికి సంబంధించిన ప్రకటన వెలువడింది’’ అని టీమిండియా దిగ్గజం, మాజీ సారథి సునిల్ గావస్కర్ అన్నారు. టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వైదొలగడం తాను ముందే ఊహించానని చెప్పారు.
కాగా దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశలపై ఆతిథ్య జట్టు నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముగిసిన మూడో టెస్టులో అద్భుత విజయంతో సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు లోనైన కోహ్లి తాను కెప్టెన్‌గా తప్పుకొంటున్నట్లు శనివారం ప్రకటన చేశాడు. ఈ విషయంపై స్పందించిన గావస్కర్ ఇండియా టు డే తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘నాకు ఇది అనుభవమే. ఒక కెప్టెన్‌గా విదేశాల్లో సిరీస్ ఓడిపోతే.. ఆ విషయాన్ని బోర్డు అధికారులు గానీ.. అభిమానులు గానీ అంత తేలికగా తీసుకోరని నాకు తెలుసు. కెప్టెన్‌పై వేటు వేసే ప్రమాదం పొంచే ఉంటుంది. గతంలో ఇలా జరిగింది. టీమిండియా ఈసారి సులభంగానే ఈ సిరీస్‌ను గెలవగలదని అంతా భావించారు. కానీ అలా జరుగలేదు. మరి కెప్టెన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది కదా’’ అని వ్యాఖ్యానించారు.
సారథిగా తనను బీసీసీఐ తొలగించక ముందే కోహ్లి ఈ ప్రకటన చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా 1979లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గావస్కర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డ మీద శ్రీనివాసరాఘవన్ వెంకటరాఘవన్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా పగ్గాలు అప్పగించామని చెప్పామని బోర్డు చెప్పింది.
ఇక ఆ తర్వాత మళ్లీ గావస్కర్ స్వదేశంలో వరుస సిరీస్‌లకు సారథ్యం వహించడం విశేషం. ఇదిలా ఉండగా.. జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. గత పర్యటనలో ఫలితాలను పునరావృతం చేసి టెస్టు సిరీస్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. 2018లో సౌతాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు 4-1 తేడాతో వన్డే సిరీస్‌ను గెలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment