
VVS Laxman lauds Mohammad Rizwan for playing semi final clash: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా గురువారం(నవంబర్11)న జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసినప్పటికీ.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్రశంసించాడు. ధైర్యానికి, దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణగా రిజ్వాన్‌ను అతడు అభివర్ణించాడు.
తన ఆరోగ్యం కంటే తన జాతీయ జట్టుకు ఆడటానికి రిజ్వాన్ ఎక్కువ ప్రాధన్యత ఇచ్చాడు అని లక్ష్మణ్ కొనియాడాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో రెండో సెమీ ఫైనల్‌కు ముందు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో ఉండే విషయంపై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్లూ కారణంగా వారు జట్టుకు దూరం కానున్నారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు వైద్యుడు నజీబ్ సొమ్రూ... ‘‘నవంబరు 9న మహ్మద్ రిజ్వాన్ తీవ్రమైన చెస్ట్ ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చేరాడు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత కోలుకున్నాడు’’ అని తెలిపాడు.
అయితే జట్టులోకి వచ్చిన మహ్మద్ రిజ్వాన్.. రెండో సెమిఫైనల్లో 67 పరుగులు చేసి పాకిస్తాన్ భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. "ధైర్యానికి, దృఢ సంకల్పానికి గొప్ప ఉదాహరణ రిజ్వాన్. ఈ మ్యాచ్‌లో తన జట్టు గెలిచి ఉండకపోవచ్చు. కానీ రెండు రోజుల పాటు ఐసీయూలో ఉన్న రిజ్వాన్ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు అతడి నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవలసినది చాలా ఉంది'అని ట్విటర్ లో లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఇక సెమీస్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.
చదవండి: IND vs NZ Test Series: కరుణ్ నాయర్ అయిపోయాడు.. ఇప్పుడు విహారి వంతు