‘డచ్‌’ పని పట్టిన పాక్‌ | Pakistan won the first match | Sakshi
Sakshi News home page

‘డచ్‌’ పని పట్టిన పాక్‌

Published Sat, Oct 7 2023 3:18 AM | Last Updated on Sat, Oct 7 2023 9:20 AM

Pakistan won the first match - Sakshi

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శనలు, అసాధారణ బౌలింగ్‌ లేకపోయినా సమష్టి తత్వంతో ఆ జట్టు తొలి అడుగును విజయవంతంగా వేసింది. అసోసియేటెడ్‌ టీమ్‌ నెదర్లాండ్స్‌పై అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. తమ ఆటతో మ్యాచ్‌లో అక్కడక్కడ పైచేయి సాధించినట్లు కనిపించినా... చివరకు నెదర్లాండ్స్‌ సులువుగానే తలవంచింది. ‘ఆరెంజ్‌’ జట్టు సంచలన విజయానికి ఈ ఆట సరిపోలేదు.   

సాక్షి, హైదరాబాద్‌: రెండు వామప్‌ మ్యాచ్‌లతో ఉప్పల్‌ స్టేడియంపై అంచనాకు వచ్చిన పాకిస్తాన్‌ ఈ వారం రోజుల అనుభవాన్ని అసలు మ్యాచ్‌లో సమర్థంగా వాడుకుంది. శుక్రవారం జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ పోరులో పాక్‌ 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సౌద్‌ షకీల్‌ (52 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్‌), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (75 బంతుల్లో 68; 8 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం నెదర్లాండ్స్‌ 41 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. బాస్‌ డి లీడ్‌ (68 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), విక్రమ్‌జిత్‌ సింగ్‌ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించినా జట్టుకు ఓటమి తప్పలేదు.  

సెంచరీ భాగస్వామ్యం... 
కనీసం 300 పరుగులు నమోదు చేస్తాం. టాస్‌ సమయంలో పాక్‌ కెపె్టన్‌ బాబర్‌ ఆజమ్‌ చేసిన వ్యాఖ్య ఇది. అయితే దానికి చేరువగా వెళ్లడంలో పాక్‌ సఫలమైంది. ఆరంభ ఓవర్లలో ప్రదర్శన చూస్తే అది కష్టంగానే అనిపించినా రెండు కీలక భాగస్వామ్యాలు జట్టును ఆదుకున్నాయి. తొలి పవర్‌ప్లేలో 9.1 ఓవర్లు ముగిసేసరికి పాక్‌ 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు ఫఖర్‌ (12), ఇమామ్‌ (15)లతో పాటు కెపె్టన్‌ బాబర్‌ ఆజమ్‌ (5) కూడా తొందరగా వెనుదిరిగారు. ఈ దశలో రిజ్వాన్, షకీల్‌ కలిసి జట్టును ఆదుకున్నారు.

ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్న వీరిద్దరు ఆ తర్వాత చక్కటి షాట్లతో దూకుడు పెంచారు. ఈ క్రమంలో షకీల్‌ 32 బంతుల్లో, రిజ్వాన్‌ 58 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి శతక భాగస్వామ్యం తర్వాత తక్కువ వ్యవధిలో పాక్‌ 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే నవాజ్‌ (43 బంతుల్లో 39; 4 ఫోర్లు), షాదాబ్‌ (34 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మళ్లీ పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 70 బంతుల్లో 64 పరుగులు జత చేశారు. చివరి 2 వికెట్లకు కలిపి మరో 34 పరుగులు రావడం కూడా పాక్‌ను మెరుగైన స్థితికి చేర్చింది.  

ఆ ఇద్దరు మినహా... 
ఛేదనలో నెదర్లాండ్స్‌కు విక్రమ్‌జిత్‌ చక్కటి షాట్లతో శుభారంభం అందించాడు. అయితే తక్కువ వ్యవధిలో జట్టు డౌడ్‌ (5), అకెర్‌మన్‌ (17) వికెట్లు కోల్పోయింది. దాంతో విక్రమ్‌జిత్‌కు డి లీడ్‌ జత కలిశాడు. వీరిద్దరి భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 76 బంతుల్లో 70 పరుగులు జత చేసింది. అయితే 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే విక్రమ్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు.

తేజ నిడమనూరు (5) విఫలం కాగా, డచ్‌ ఆ వెంటనే మరో 2 చేజార్చుకుంది. అయితే డి లీడ్‌ క్రీజ్‌లో ఉన్నంత వరకు టీమ్‌కు కాస్త ఆశలు ఉన్నాయి. 50 బంతుల్లోనే అతను హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. నవాజ్‌ చక్కటి బంతిని లీడ్‌ బౌల్డ్‌ కావడంతో ‘డచ్‌’ జట్టు ఓటమి లాంఛనమే అయింది.  

స్కోరు వివరాలు 
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఫఖర్‌ (సి అండ్‌ బి) వాన్‌ బీక్‌ 12; ఇమామ్‌ (సి) దత్‌ (బి) మీకెరెన్‌ 15; బాబర్‌ (సి) సాఖిబ్‌ (బి) అకెర్‌మన్‌ 5; రిజ్వాన్‌ (బి) డి లీడ్‌ 68; షకీల్‌ (సి) సాఖిబ్‌ (బి) దత్‌ 68; ఇఫ్తికార్‌ (సి) ఎడ్వర్డ్స్‌ (బి) డి లీడ్‌ 9; నవాజ్‌ (రనౌట్‌) 39; షాదాబ్‌ ఖాన్‌ (బి) డి లీడ్‌ 32; హసన్‌ అలీ (ఎల్బీ) (బి) డి లీడ్‌ 0; షాహిన్‌ అఫ్రిది (నాటౌట్‌) 13; రవూఫ్‌ (స్టంప్డ్‌) ఎడ్వర్డ్స్‌ (బి) అకెర్‌మన్‌ 16; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్‌) 286. వికెట్ల పతనం: 1–15, 2–34, 3–38, 4–158, 5–182, 6–188, 7–252, 8–252, 9–267, 10–286. బౌలింగ్‌: ఆర్యన్‌ దత్‌ 10–0–48–1, వాన్‌ బీక్‌ 6–0–30–1, అకెర్‌మన్‌ 8–1–39–2, మీకెరెన్‌ 6–0–40–1, డి లీడ్‌ 9–0–62–4, మెర్వ్‌ 6–0– 36– 0, విక్ర మ్‌జిత్‌ 2–0–16–0, సాఖిబ్‌ 2–0– 15–0.  
నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: విక్రమ్‌జిత్‌ (సి) ఫఖర్‌ (బి) షాదాబ్‌ 52; మ్యాక్స్‌ డౌడ్‌ (సి) షాహిన్‌ (బి) హసన్‌ 5; అకెర్‌మన్‌ (బి) ఇఫ్తికార్‌ 17; డి లీడ్‌ (బి) నవాజ్‌ 67; తేజ (సి) ఫఖర్‌ (బి) రవూఫ్‌ 5; ఎడ్వర్డ్స్‌ (ఎల్బీ) (బి) రవూఫ్‌ 0; సాఖిబ్‌ (ఎల్బీ) (బి) షాహిన్‌ 10; వాన్‌డర్‌ మెర్వ్‌ (రనౌట్‌) 4; వాన్‌ బీక్‌ (నాటౌట్‌) 28; దత్‌ (బి) హసన్‌ 1; మీకెరెన్‌ (బి) రవూఫ్‌ 7; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్‌) 205. వికెట్ల పతనం: 1–28, 2–50, 3–120, 4–133, 5–133, 6–158, 7–164, 8–176, 9–184, 10–205. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 7–0–37–1, హసన్‌ అలీ 7–1–33–2, రవూఫ్‌ 9–0–43–3, ఇఫ్తికార్‌ అహ్మద్‌ 3–0–16–1, మొహమ్మద్‌ నవాజ్‌ 7–0– 31–1, షాదాబ్‌ ఖాన్‌ 8–0–45–1.  

ప్రపంచకప్‌లో నేడు
అఫ్గానిస్తాన్‌ X బంగ్లాదేశ్‌ 
వేదిక: ధర్మశాల 
ఉదయం గం. 10:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

శ్రీలంక X దక్షిణాఫ్రికా 
వేదిక: న్యూఢిల్లీ 
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement