ముంబై : ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే ద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు.. టెస్ట్ స్పెషలిస్ట్ వివిఎస్ లక్ష్మణ్ కోహ్లి సాధించిన రికార్డుపై శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.
'నాకు తెలిసినంతవరకు ఒక ఆటగాడు ఇన్నేళ్ల కెరీర్‌లో ఒకే ఇంటన్సిటీతో పరుగులు సాధించడమనేది ఇప్పుడే చూస్తున్నా. అది విరాట్ కోహ్లి కావడం ఇక్కడ గర్వించదగ్గాల్సిన విషయం. కోహ్లి కెరీర్ మొదట్లో తాను ఆడిన తీరు గమనిస్తే.. వేగంగా పరుగులు చేయడానికే బరిలోకి దిగినట్లు కనిపించేవాడు. కెరీర్ ఆరంభం కాబట్టి అలా ఉండడం సహజం... కెరీర్ సాగుతున్న అతని వేగం ఆగిపోతుందని భావించా... కానీ అలా జరగలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్కసారి కూడా అతని ఎనర్జీ లెవెల్స్‌లో డ్రాప్ కనిపించకపోవడం విశేషం.(చదవండి : పాపం కోహ్లి.. మూడు సార్లు అతని బౌలింగ్‌లోనే)
అది బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా ఏదైనా సరే పాదరసంలా కదులుతుంటాడు. కోహ్లి చేసిన 42 సెంచరీల్లో 26 సెంచరీలు చేజింగ్‌లో రావడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. సాధారణంగా చేజింగ్‌లో పెద్ద స్కోరు ఉంటే బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనవుతుంటాడు. కోహ్లి విషయంలో మాత్రం ఇది వర్తించదు. ఎంత ఎక్కువ ఒత్తిడి ఉంటే అంత బాగా ఆడడం కోహ్లికున్న ప్రత్యేకం అని చెప్పొచ్చు. 'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
కాగా కోహ్లి ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు 12వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. సచిన్ 12వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 309 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. కోహ్లి మాత్రం 242 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. కాగా ఓవరాల్‌గా కోహ్లి కెరీర్‌లో 251 మ్యాచ్‌ల్లో 12040, 86 టెస్టుల్లో 7240, 82 టీ20ల్లో 2794 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment