వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికా మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ప్రోటీస్.. అనంతరం బౌలింగ్‌లో బంగ్లాకు చుక్కలు చూపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.
ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగగా.. హెన్రిస్ క్లాసెన్ మెరుపులు మెరిపించాడు. 140 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేయగా.. క్లాసెన్ కేవలం 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు.
అనంతరం 383 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మహ్మదుల్లా 111 బంతుల్లో 111 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు సాధించగా.. జానెసన్, విలియమ్స్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక ఈ విజయంపై ప్రోటీస్ తాత్కాలిక సారథి ఐడెన్ మార్క్రామ్ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన పట్ల మార్క్రామ్ సంతోషం వ్యక్తం చేశాడు.
"ఈ మెగా టోర్నీలో మరో విజయం సాధించడం ఆనందంగా ఉంది. మా బాయ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మొదట బ్యాటింగ్‌లో, తర్వాత బౌలింగ్‌లో మేము పైచేయి సాధించాం. మాకు ఎటువంటి డెత్ బౌలింగ్ సమస్య లేదు. ఈ మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో మా బౌలర్లు కొంచెం అదనంగా పరుగులు సమర్పించుకున్నారు.
ఎందుకంటే అవతలి ఎండ్‌లో మహ్మదుల్లా క్రీజులో సెటిల్ అయివున్నాడు. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మా డెత్ బౌలింగ్ ప్రణాళికలను అమలు చేయడానికి అదే సరైన సమయమని భావించాడు. కానీ అతడు మా బౌలర్లపై కాస్త పైచేయి సాధించాడు. ఇక బ్యాటింగ్‌లో డికాక్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
అతడు మా జట్టులో చాలా కీలకం. అదే విధంగా క్లాసెన్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. మాకు అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. మా బ్యాటింగ్ లైనప్ టాప్ 6లో ఉన్న ప్రతీ ఒక్కరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ప్రతీ ఒక్కరి రోల్ క్లియర్‌గా ఉంది.
ఇక బావుమా ప్రస్తుతం కోలుకున్నాడు. అతడు పాకిస్తాన్‌తో జరిగే మా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కాగా ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా మాకు బాగా కలిసొచ్చిందని" పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో మార్క్రామ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment