‘‘ఆ సమయంలో నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చెప్పలేను. చాలా చాలా మాట్లాడాలని ఉంది కానీ.. ఆ విషయాల గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. ఏం జరుగుతుందో తెలియలేదు.
బహుశా.. నేనిలా ముందుకు సాగాలనే ఆ అల్లా నాకు ధైర్యాన్నిచ్చాడేమో! ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతూ మరింత కఠిన శ్రమకోరుస్తున్నాను. నేను చేయగలిగింది అంతే కదా! జట్టు విజయాల్లో నా పాత్ర ఉండాలని కోరుకుంటాను.
నిజానికి నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగానే విశ్రాంతినిచ్చారు. అయినా నా చేతుల్లో ఏమీలేదు. అంతా మేనేజ్‌మెంట్ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఒకవేళ నేను నా పనిని నిజాయితీగా పూర్తి చేస్తే నాతో పాటు జట్టుకు కూడా మేలు జరుగుతుంది’’ అని బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అన్నాడు.
విశ్రాంతి పేరిట తనను చాలా కాలం పాటు బెంచ్‌కే పరిమితం చేశారంటూ సెలక్టర్లకు పరోక్షంగా చురకలు అంటించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బంగ్లాను ప్రొటిస్ జట్టు 149 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.
అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయినప్పటికీ మహ్మదుల్లా పోరాటం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. సౌతాఫ్రికా విధించిన 383 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కనీసం రెండంకెల స్కోరు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ నజ్ముల్ షాంటో సున్నాకే పరిమితమయ్యాడు.
ఇక మిడిలార్డర్‌లో కెప్టెన్ షకీబ్ అల్ హసన్(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహ్మదుల్లా సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 111 బంతులు ఎదుర్కొని 111 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు సహా 4 సిక్సర్లు ఉన్నాయి.
అయితే, మిగతా ఆటగాళ్ల నుంచి ఏమాత్రం సహకారం లభించకపోవడంతో మహ్మదుల్లా ఒంటరి పోరాటం వృథాగా పోయింది. సౌతాఫ్రికా చేతిలో బంగ్లాదేశ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వెటరన్ బ్యాటర్ మహ్మదుల్లా మాట్లాడుతూ.. జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశానని పేర్కొన్నాడు.
ఈ క్రమంలో పనిలో పనిగా సెలక్టర్లతో పాటు తనను విమర్శించిన వాళ్లకు ఆటతోనే బదులిస్తానంటూ 37 ఏళ్ల మహ్మదుల్లా కౌంటర్లు వేశాడు. కాగా ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌కు మహ్మదుల్లాను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. దాదాపు ఆర్నెళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అతడికి తిరిగి జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2023 టీమ్‌లో స్థానం సంపాదించిన మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 3 శతకాలు చేసి.. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: బేకరీ వ్యాపారం.. అడుగడుగునా అవమానాలు.. దోషిలా విచారణ! 800వ వికెట్ అతడే..
Comments
Please login to add a commentAdd a comment