WC 2023: పొరపాటు చేయలేదు.. మా ఓటమికి కారణాలివే! అయినా..: బట్లర్‌ | Sakshi
Sakshi News home page

WC 2023: పొరపాటు చేయలేదు.. అయినా గర్వపడుతున్నాం.. మాది చెత్త టీమ్‌ కాదు: బట్లర్‌

Published Thu, Oct 26 2023 8:05 PM

WC 2023 Eng Vs SL: Jos Buttler On Loss Incredibly Tough Brink On Exit - Sakshi

ICC WC 2023- Jos Buttler Comments On Loss: ‘‘మాకిది కష్టకాలం. కెప్టెన్‌గా నాతో పాటు మా ఆటగాళ్లంతా పూర్తిగా నిరాశకు లోనయ్యాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాం. మా జట్టులో అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. కానీ ఇపుడిలా జరిగిపోయింది.

అయినా ఒక్కరోజులో మాది చెత్త టీమ్‌గా మారిపోదు కదా! అయితే, బాధ.. మాపై మాకు కోపం.. విసుగు వస్తున్నాయి. మేమిలా విఫలం చెందడానికి ఇదీ కారణం అని చెప్పడానికి ఏమీ లేదు. సెలక్షన్‌ విషయంలో మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు. మాకది అసలు సమస్యే కాదు. అయితే, స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాం అనేది మాత్రం వాస్తవం.

ఆ విషయంలో గర్వపడుతున్నాం
ఈరోజు రూట్‌ రనౌట్‌ కావడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. సాధారణంగా మేము ఇలాంటి తప్పులు చేయము. ఈరోజు భాగస్వామ్యాలు నెలకొల్పడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందాం. బ్యాట్‌, బంతి.. రెండింటితోనూ కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాం.

ఏదేమైనా పటిష్ట జట్టుగా ఎదిగిన తీరు, మేము నెలకొల్పిన ప్రమాణాల పట్ల గర్వపడుతున్నాం. మిగిలిన మ్యాచ్‌లలో తిరిగి పుంజుకుని రాణిస్తామనే నమ్మకం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’’అని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ అన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ వరుస పరాభవాలు మూటగట్టుకుంటోంది.

శ్రీలంక చేతిలో మరోసారి చిత్తుగా
తాజాగా బెంగళూరులో గురువారం శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ఇంగ్లండ్‌. వరల్డ్‌కప్‌ చరిత్రలో ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయాలతో దూసుకుపోతున్న శ్రీలంక మరోసారి అదే ఫీట్‌ రిపీట్‌ చేయడంతో ఇంగ్లండ్‌కు మరో ఘోర ఓటమి ఎదురైంది. 

దీంతో హాట్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన బట్లర్‌ బృందం సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ స్థాయికి తగ్గట్లు ఆడలేక పరాభవాల పాలవుతున్నామని పేర్కొన్నాడు. తదుపరి మ్యాచ్‌లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపాడు.

ఇంగ్లండ్‌ వర్సెస్‌ శ్రీలంక స్కోర్లు:
►టాస్‌- ఇంగ్లండ్‌- బ్యాటింగ్‌
►ఇంగ్లంగ్‌ స్కోరు: 156 (33.2)
►శ్రీలంక స్కోరు: 160/2 (25.4)
►8 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: లాహిరు కుమార(మూడు వికెట్లు)
►టాప్‌ స్కోరర్‌: పాతుమ్‌ నిసాంక(77- నాటౌట్‌)

చదవండి: శ్రీలంక చేతిలో ఇంగ్లండ్‌కు మరో ఘోర ఓటమి.. సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లేనా?

Advertisement
Advertisement