ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023 శ్రీలంకకు అస్సలు కలిసి రావడం లేదు. నేరుగా టోర్నీకి అర్హత సాధించని కారణంగా క్వాలిఫయర్స్ ఆడి ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టిన ఈ మాజీ చాంపియన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
స్టార్లు దూరం
గాయాల కారణంగా కెప్టెన్ దసున్ షనక సహా స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి తరుణంలో జట్టు పగ్గాలు చేపట్టిన కుశాల్ మెండిస్ జట్టును విజయవంతంగా ముందుకు నడపడంలో విఫలమవుతున్నాడు.
టీమిండియా చేతిలో చావుదెబ్బ
దీంతో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక(అనధికారికంగా).. వాంఖడేలో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముంబైలో గురువారం నాటి మ్యాచ్‌లో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెండిస్ బృందం మరీ ఘోరంగా 55 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ధాటికి టాపార్డర్ కకావికలం కాగా.. మరో ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో లంక 302 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది.
‘సమిష్టి వైఫల్యం’
ఇదిలా ఉంటే.. ఆరంభంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో లంక బౌలర్లు ఏకంగా 428 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడితే.. టీమిండియాతో మ్యాచ్లో బ్యాటర్లు విఫలమైన తీరు విమర్శలకు దారితీసింది.
ఈ నేపథ్యంలో జట్టు ఆట తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఘోర వైఫల్యాలకు గల కారణాలేమిటో వెల్లడించాలంటూ సెలక్టర్లు, కోచ్, ఆటగాళ్లకు నోటీసులు ఇచ్చింది.
షాకింగ్ ఓటములు
ఈ మేరకు.. ‘‘ఇప్పటి వరకు ఓవరాల్ ప్రదర్శన.. ఇటీవల విస్మయకరరీతిలో భారీ పరాజయాలను చూసిన తర్వాత మెగా టోర్నీకి జట్టు సన్నద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారన్న విషయం చర్చనీయాంశమైంది. నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెషనల్ స్టాఫ్ విషయంలో బోర్డు ఏమాత్రం జోక్యం చేసుకోదు. వారి విధులు, బాధ్యతలకు ఆటంకం కలిగించదు.
బాధ్యులు మీరే.. బదులివ్వండి
కానీ.. మీ నుంచి మేము జవాబుదారీతనం, పారదర్శకత కోరుకుంటున్నాం. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయట పడాలన్న అంశంపై దృష్టి పెట్టండి. మన జట్టు ఎంపిక, సన్నద్ధత.. తుదిజట్టు కూర్పు విషయంలో ఎలాంటి ప్రణాళికలు రచించారో వివరించండి. జట్టుతో పాటు ప్రతి ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనను అంచనా వేసి.. వారి బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోండి.
దృష్టి సారించండి
ఆటగాళ్ల గాయాలు, ఫిట్‌నెస్ గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందే మా దృష్టికి తీసుకురండి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫలితాన్ని విశ్లేషించి భవిష్యత్తులో పొరపాట్లు దొర్లకుండా చూసుకోండి. కోచింగ్ టీమ్ ఈ విషయంమై లోతుగా అధ్యయనం చేయాలి’’ అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో పేర్కొంది.
మాజీ చాంపియన్‌కు ఏమిటీ దుస్థితి?
కాగా ముంబైలోని వాంఖడేలో 2011లో ఫైనల్లో టీమిండియాకు గట్టిపోటీనిచ్చిన లంక.. ఈసారి అదే వేదికపై 55 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులతో పాటు లంక మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
సెమీస్ మాట పక్కన పెడితే మరీ ఇంత అధ్వాన్న రీతిలో ఓడిపోవాలా? మాజీ చాంపియన్‌కు ఏమిటీ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరి సత్తా చాటింది.
చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్! ఐసీసీ ప్రకటన విడుదల
Comments
Please login to add a commentAdd a comment