
ICC Cricket WC 2023- New Zealand vs Netherlands, 6th Match: వన్డే వరల్డ్‌కప్-2023లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. రెండో మ్యాచ్‌లో ‘పసికూన’ నెదర్లాండ్స్‌ను 99 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు సాధించింది.
ముగ్గురు అర్ధ శతకాలతో రాణించి
ఓపెనర్ విల్ యంగ్ 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 51, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో రాణించారు. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు.
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు విక్రంజిత్ సింగ్(12), మాక్స్ ఒడౌడ్(16) వికెట్లు కోల్పోయి డీలా పడినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ కొలిన్ అకెర్మాన్ డచ్ శిబిరంలో ఆశలు రేపాడు.
ఆశలు రేపాడు
69 పరుగులతో రాణించిన అతడు అవుట్ కావడంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనం మొదలైంది. సాంట్నర్ దెబ్బకు డచ్ జట్టు పెవిలియన్‌కు క్యూ కట్టింది. దీంతో... 99 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఐదు వికెట్లతో చెలరేగిన సాంట్నర్
స్పిన్ బౌలర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ సాంట్నర్ అత్యధికంగా ఐదు వికెట్లు కూల్చి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. పేసర్ మ్యాట్ హెన్రీకి మూడు, మరో లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కాయి. ఇక తెలుగు మూలాలున్న డచ్ బ్యాటర్ తేజ నిడమనూరు రనౌట్‌గా వెనుదిరిగాడు.
చదవండి: WC 2023: తడబడి.. నిలబడిన టీమిండియాకు బిగ్ షాక్! పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి..