WC 2023: ‘స్టార్‌ ఓపెనర్‌’పై వేటు! కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ అంటూ.. |World Cup 2023, Pak Vs SL: So Fakhar Zaman Officially Out From India Game: Fans - Sakshi
Sakshi News home page

Ind vs Pak: టీమిండియాతో మ్యాచ్‌కు కూడా లేనట్లే! కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ అంటూ..

Published Tue, Oct 10 2023 4:56 PM | Last Updated on Tue, Oct 10 2023 6:09 PM

WC 2023 Pak Vs SL: So Fakhar Zaman Officially Out From India Game: Fans - Sakshi

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విఫలమైన పాకిస్తాన్‌ ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌పై వేటు పడింది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో పాక్‌ మేనేజ్‌మెంట్‌ అతడికి చోటు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా ఫఖర్‌ జమాన్‌ స్థానంలో అబ్దుల్లా షఫీక్‌ తుదిజట్టులోకి వచ్చాడు.

టాపార్డర్‌లో తమ ఆటగాళ్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్‌ సమయంలో కెప్టెన్‌ బాబర్‌ ఆజం వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో అక్టోబరు 14 నాటి మ్యాచ్‌ నుంచి ఫఖర్‌ జమాన్‌ను తప్పిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై నెట్టింట్లో సెటైర్లు పేలుతుండగా.. అభిమానులు మాత్రం ఫఖర్‌ జమాన్‌కు అండగా నిలుస్తున్నారు. ‘‘బాబర్‌ ఆజం మాటల్ని బట్టి.. టీమిండియాతో మ్యాచ్‌ నుంచి జమాన్‌ అవుట్‌ అయ్యాడని అధికారికంగా తెలిసిపోయింది. నిజానికి 2019 వరల్డ్‌కప్‌ టోర్నీలో షోయబ్‌ మాలిక్‌కు ఇలాగే జరిగింది.

ఏదేమైనా పాక్‌ తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడిన ఘనత ఫఖర్‌ జమాన్‌ది. తదుపరి మ్యాచ్లో ఆడే అవకాశం వస్తుందో లేదో! ఒకవేళ మళ్లీ అతడిని జట్టులోకి తీసుకోలేదంటే కెరీర్‌ ముగిసిపోతుందనడానికి సంకేతాలు వచ్చినట్లే!’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మైదానంలో పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే.

నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫఖర్‌ జమాన్‌ కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత 11 ఇన్నింగ్స్‌లో ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ కనీసం ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సగటు 18.36తో 202 పరుగులు సాధించాడు. అయితే, 33 ఏళ్ల ఫఖర్‌ జమాన్‌ 2023 ఆరంభంలో మాత్రం ఐదు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, ఒక అర్ధ శతకం సాయంతో 454 పరుగులు చేశాడు.

ఇక అబ్దుల్లా షఫీక్‌ చివరగా ఆసియా కప్‌-2023 మ్యాచ్‌లో శ్రీలంక మీద హాఫ్‌ సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. 2017లో పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఫఖర్‌ జమాన్‌ ఇప్పటి వరకు 79 వన్డేల్లో కలిపి 3284 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 15 అర్ద శతకాలు ఉన్నాయి. 

చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన జో రూట్‌.. ఆల్‌టైం రికార్డు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement