ICC WC 2023- Pak Vs SA- Babar Azam Comments On Loss: ‘విజయానికి అత్యంత చేరువగా వచ్చాం.. కానీ సరైన ముగింపు ఇవ్వలేకపోయాం. జట్టు మొత్తం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఆఖరి ఓవర్లలో మేము తిరిగి పుంజుకున్న తీరు.. కనబరిచిన పోరాట పటిమ అద్భుతం. కానీ ఇలా జరిగిపోయింది’’ అని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విచారం వ్యక్తం చేశాడు.
అలా అయితే ఫలితం వేరేలా ఉండేది
తాము మరో 10-15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో హ్యాట్రిక్ ఓటములతో డీలాపడిన పాకిస్తాన్.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ప్రొటిస్ టెయిలెండర్ కేశవ్ మహరాజ్ ఫోర్ బాదడంతో.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ రేసులో ముందుకు వెళ్లాలనుకున్న పాకిస్తాన్‌కు భంగపాటు ఎదురైంది.
అందుకే ఓడిపోయాం
ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందించిన బాబర్ ఆజం.. తమ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారని.. కానీ దురదృష్టవశాత్తూ అనుకున్న ఫలితం రాబట్టలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.
అతడు అవుట్ అయితే సెమీస్ రేసులో ఉండేవాళ్లం
అదే విధంగా.. 46వ ఓవర్ ఆఖరి బంతికి సౌతాఫ్రికా టెయిలెండర్ తబ్రేజ్ షంసీ విషయంలో ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేసిన పాకిస్తాన్‌కు ప్రతికూల ఫలితం వచ్చిన విషయాన్ని బాబర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘డీఆర్‌ఎస్ ఆటలో భాగం. ఒకవేళ అతడిని అవుట్‌గా పరిగణించినట్లయితే.. ఫలితం మాకు అనుకూలంగా ఉండేది.
సెమీస్ రేసులో నిలిచేందుకు మాకు అవకాశాలు ఉండేవి. కానీ అలా జరుగలేదు’’ అని అంపైర్ కాల్ వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇక తదుపరి మూడు మ్యాచ్‌లలో బాగా ఆడి పాకిస్తాన్‌ను గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్న బాబర్.. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో ఎక్కడి వరకు చేరుకుంటామో చూద్దామంటూ నిర్వేదంగా మాట్లాడాడు.
హైడ్రామా..
కాగా పేసర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో షంసీ ఎల్బీడబ్ల్యూ అయినట్లు నమ్మకంగా ఉన్న పాకిస్తాన్‌కు అంపైర్స్ కాల్ షాకిచ్చిన విషయం తెలిసిందే. రవూఫ్ సంధించిన ఇన్‌స్వింగర్ లెగ్ స్టంప్స్‌ను తాకినట్లుగా అనిపించింది.
అయితే, బాల్ ట్రాకింగ్‌లో తృటిలో మిస్ అయినట్లు కనిపించగా.. నాటౌట్‌గా పేర్కొన్న అంపైర్స్ కాల్ వల్ల సౌతాఫ్రికా బతికిపోయింది. మరుసటి రెండో ఓవర్ వరకు హైడ్రామా నడవగా కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికా విజయ లాంఛనం పూర్తి చేశాడు.
పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా స్కోర్లు:
►వేదిక: చెన్నై చెపాక్ స్టేడియం
►టాస్: పాకిస్తాన్- తొలుత బ్యాటింగ్
►పాక్ స్కోరు: 270 (46.4)
►సౌతాఫ్రికా స్కోరు: 271/9 (47.2)
►ఫలితం: ఒక్క వికెట్ తేడాతో సౌతాఫ్రికా విజయం
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తబ్రేజ్ షంసీ(4 వికెట్లు)
చదవండి: WC 2023: అతడు లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి! గిల్ కూడా..
Comments
Please login to add a commentAdd a comment