ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: భారత్‌లో వన్డే ప్రపంచకప్-2023.. రెండు వరుస విజయాలు.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు.. వెరసి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.. ఇలాంటి దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దురదృష్టం వెక్కిరించింది..
‘చోకర్స్’ అన్న పేరున్న జట్టు చేతిలో ఘోర పరాభవానికి గురై సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే దుస్థితికి చేరుకుంది.. ఈ ఉపోద్ఘాతమంతా పాకిస్తాన్ జట్టు గురించే అని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.
ఆరంభ శూరత్వమే!
వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం బృందం 81 పరుగులతో జయభేరి మోగించింది. అనంతరం మ్యాచ్‌లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత గెలుపు అన్న మాటనే మరిచిపోయింది.
చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత.. పాకిస్తాన్‌ను వరుసగా పరాజయాలే పలకరించాయి. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా సైతం తమపై జయకేతనం ఎగురవేయడంతో బాబర్ బృందం సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి.
నువ్వా- నేనా.. నరాలు తెగే ఉత్కంఠ
అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అటు పాకిస్తాన్ ఆటగాళ్లు.. తమపై పాక్ ఆధిపత్యాన్ని తగ్గించడం సహా టేబుల్ టాపర్‌గా నిలించేందుకు ఇటు సౌతాఫ్రికా ప్లేయర్లు పోరాడిన తీరు మాత్రం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది.
పాక్ విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు మరోసారి చోకర్స్ అనిపించుకోవడం ఖాయమంటూ విశ్లేషణలు ఓవైపు.. ఆఖరి వికెట్ తీసేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచి నిలుస్తుందా అన్న చర్చలు మరోవైపు.. చివరి వరకు హైడ్రామా..
పాక్ గెలుపు ఖాయమైందన్నంతగా
ఆ మధ్యలో 46వ ఓవర్ ఆఖరి బంతికి పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్.. సఫారీ జట్టు టెయిలెండర్ తబ్రేజ్ షంసీని అవుట్ చేసినంత పనిచేశాడు. పాక్‌కు గెలుపు ఖాయమైపోయిందన్నంత నమ్మకంగా ఎల్బీకి అప్పీలు చేశాడు.
అయితే అనుభవజ్ఞుడైన అంపైర్ అలెక్స్ వార్ఫ్ అదేమీ లేదన్నట్లు అడ్డంగా తలూపాడు. పాకిస్తాన్‌కు వేరే ఆప్షన్ లేదు. రవూఫ్ ఓవైపు.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మరోవైపు నమ్మకంగా చెప్పడంతో కెప్టెన్ బాబర్ ఆజం రివ్యూకు వెళ్లాడు.
సఫారీల అదృష్టం బాగుంది
కానీ.. షంసీ అదృష్టం బాగుంది. బంతి లెగ్ స్టంప్‌ను జస్ట్ అలా ముద్దాడినట్లుగా అనిపించింది గానీ మిస్ అయింది.. అంపైర్స్ కాల్ నాటౌట్ కావడంతో సౌతాఫ్రికాకు ఫేవర్‌గా ఫలితం వచ్చింది.
అంతే.. పాక్ ఆటగాళ్లు ఒక్కసారిగా నీరుగారిపోయారు. రవూఫ్ అయితే ఏడ్చినంత పనిచేశాడు. రిజ్వాన్ సైతం ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చి రవూఫ్‌ను హత్తుకుని ‘ఎమోషనల్’ అయ్యాడు. పాకిస్తాన్ శిబిరం మొత్తం నిరాశలో కూరుకుపోయింది.
ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది
ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లలో కొందరు పాక్ ఆటగాళ్లకు సానుభూతి తెలుపుతుండగా.. ‘‘ఓవరాక్షన్ రిజ్వాన్‌ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
కాగా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త అతి చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించే క్రమంలో మాటిమాటికి గట్టిగా అప్పీలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆటతో సంబంధంలేని విషయాల్లోనూ తలదూరుస్తూ ఉంటాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు.
మేము చోకర్స్ కాదు.. అర్థమైందా?
ఇక చెన్నై మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పాక్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్ రెండో బంతికి కేశవ్ మహరాజ్ ఫోర్ బాది పాకిస్తాన్ ఓటమిని ఖరారు చేసి సౌతాఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’(అంతా బాగా ఆడి ఆఖరి నిమిషంలో చేతులెత్తేస్తారన్న అర్థంలో) అన్న ట్యాగ్ ఇకపై తమకు వాడొద్దనేలా సంకేతాలు ఇచ్చాడు. ఇక సఫారీల చేతిలో ఓటమితో పాక్ సెమీ ఫైనల్ ఆశలకు దాదాపు గండిపడినట్లే!
చదవండి: Ind vs Aus: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ అతడే
WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్
Comments
Please login to add a commentAdd a comment