రోహిత్ శర్మ- అజిత్ అగార్కర్ (PC: BCCI)
India World Cup 2023 squad: ‘‘జట్టు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ క్రమంలో కొందరికి నిరాశ కలగడం సహజం. సమతూకం కోసమే శార్దుల్, అక్షర్‌లను తీసుకున్నాం. గత కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్‌లో బలహీన బ్యాటింగ్‌తో సమస్య ఎదుర్కొన్నాం. 8వ, 9వ స్థానాల్లో ఆడేవారు కూడా కొన్ని పరుగులు చేయడం అవసరం.
వారికి ఆ విషయం స్పష్టంగా చెప్పాం కూడా. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో హార్దిక్ ఆట చూస్తే అతను ఎంత కీలకమో అర్థమవుతుంది. ఫైనల్‌తో కలిపితే 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. టి20లతో పోలిస్తే వన్డేల్లో కోలుకునేందుకు, వ్యూహాలు రూపొందించుకునేందుకు తగినంత సమయం ఉంటుంది.
అందుకే అక్షర్‌కు చోటు
అన్ని రకాలుగా ఈ టీమ్ అత్యుత్తమం అని మేం భావిస్తున్నాం. టీమ్ ప్రకటించేందుకు ముందు ఎంతో చర్చించి, ఎంతో ఆలోచింతాం. ఎంపికతో ఎంతో సంతృప్తిగా ఉన్నాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. జట్టు సమతూకం కోసం ఆల్‌రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్ పేరును చేర్చినట్లు వెల్లడించాడు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి రోహిత్ మంగళవారం.. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టును ప్రకటించాడు.
నాడు రోహిత్‌ను కాదన్న ధోని
ఈ సందర్భంగా టీమ్‌లో స్థానం దక్కదని వాళ్ల బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునన్న హిట్‌మ్యాన్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. కాగా 2011 వరల్డ్‌కప్ సమయంలో రోహిత్ శర్మ పేరును పరిగణనలోకి తీసుకోవాలని సెలక్టర్లు సూచించినప్పటికీ.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పీయూశ్ చావ్లా కోసం అతడిని పక్కన పెట్టాడని ఇటీవలే మాజీ సెలక్టర్ రాజా వెంకట్ పేర్కొన్న విషయం తెలిసిందే.
అందుకే ఆఫ్ స్పిన్నర్ ఆలోచన విరమించుకున్నాం: అగార్కర్
జట్టులో ఇప్పుడు ఎవరికీ ఫిట్‌నెస్ సమస్యలు లేవు. అందరూ పూర్తిగా కోలుకున్నారు. ఎన్‌సీఏలో జరిగిన క్యాంప్‌లో రాహుల్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 50 ఓవర్లు కీపింగ్ కూడా చేశాడు. కాబట్టి అతని గురించి ఎలాంటి ఆందోళన లేదు. ఆఫ్‌స్పిన్నర్‌పై చర్చ జరిగింది.
అయితే జడేజా, అక్షర్ ఎడంచేతి వాటం బ్యాటర్లకు సమర్థంగా బౌలింగ్ చేయగలరని నమ్ముతున్నాం. వీరిద్దరి బ్యాటింగ్ కూడా అవసరం కాబట్టి ఆఫ్‌స్పిన్నర్ ఆలోచనను పక్కన పెట్టాం’’ అని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తమ ఎంపికలను సమర్థించుకున్నాడు. కాగా 2011 నాటి వరల్డ్‌కప్ జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
అదే విధంగా సచిన్ టెండుల్కర్, సురేశ్ రైనా రూపంలో మంచి ఆప్షన్లు ఉండేవి. ఇక 2019 నాటికి లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, ఆఫ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే, ఈసారి మాత్రం ఉపఖండ పిచ్‌పై ఆఫ్ స్పిన్నర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుండటంపై మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: అతడు ఉండగా అక్షర్ ఎందుకు? మ్యాచ్ విన్నర్‌కు చోటు లేకపోవడమేమిటి?: మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment