‘వదిలేసిన చెత్త’ అంటూ ఓవరాక్షన్‌.. పాపం అతడి పరిస్థితి ఇదీ! | Yash Dayal Painful Revelation After RCB Hit Back At Murali Kartik Trash Talk | Sakshi
Sakshi News home page

‘వదిలేసిన చెత్త’ అంటూ ఓవరాక్షన్‌.. దిమ్మతిరిగేలా కౌంటర్‌! ఆరోజు ఏమైందంటే?

Published Tue, Mar 26 2024 6:14 PM | Last Updated on Wed, Mar 27 2024 8:53 AM

Yash Dayal Painful Revelation After RCB Hit Back At Murali Kartik Trash Talk - Sakshi

మురళీ కార్తిక్‌- యశ్‌ దయాళ్‌ (PC: RCB)

‘‘ఒకరు వదిలేసిన చెత్త.. మరొకరికి విలువైన ఖజానా’’.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నయా పేసర్‌ యశ్‌ దయాల్‌ గురించి టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ మురళీ కార్తిక్‌ చేసిన వ్యాఖ్య ఇది. తమ ఆటగాడిని పట్టుకుని ‘ట్రాష్‌’ అన్నందుకు అతడికి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది ఆర్సీబీ.

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో యశ్‌ దయాళ్‌ ప్రదర్శనను కొనియాడుతూ.. ‘‘అవును.. అతడొక విలువైన ఖజానా’’ అంటూ మురళీ​ కార్తిక్‌ స్టైల్లోనే అతడికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో యశ్‌ దయాళ్‌ గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. గుజరాత్‌ తనకోసం వెచ్చించిన రూ. 3.2 కోట్లకు ఆ స్థాయిలో న్యాయం చేయలేకపోయాడీ యూపీ బౌలర్‌.

అయితే, ఆ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ మాత్రం యశ్‌ దయాళ్‌కు పీడకలను మిగిల్చింది. అతడి బౌలింగ్‌లో కేకేఆర్‌ ఫినిషర్‌ రింకూ సింగ్‌ ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది తమ జట్టును గెలిపించాడు. దీంతో యశ్‌ దయాళ్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగింది.

విపరీతపు కామెంట్లతో యశ్‌పై విరుచుకుపడ్డారు కొంతమంది నెటిజన్లు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024కు ముందు గుజరాత్‌ యశ్‌ దయాళ్‌ను వదిలివేయగా.. ఆర్సీబీ ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేసింది.

ఈ క్రమంలో పదిహేడో ఎడిషన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున ఒక వికెట్‌ తీసిన యశ్‌ దయాళ్‌.. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో సత్తా చాటాడు. పవర్‌ ప్లేలో తాను వేసిన మూడు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. డెత్‌ ఓవర్‌లో సామ​ కర్రన్‌ను బౌన్సర్‌తో బోల్తా కొట్టించి ఒక వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆర్సీబీ విజయంలో తానూ భాగమయ్యాడు.

అయితే, మురళీ కార్తిక్‌ మాత్రం యశ్‌ దయాళ్‌ను ఉద్దేశించి ఈ మేరకు కామెంట్‌ చేయడం గమనార్హం. ఫలితంగా అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం యశ్‌ దయాళ్‌ మాట్లాడుతూ.. నాటి చేదు ఘటన(రింకూ సిక్సర్లు)ను గుర్తు చేసుకున్నాడు.

‘‘ఆరోజు మ్యాచ్‌ అయిపోయిన తర్వాత నేను మైదానం వీడి వెళ్లిపోయాను. సోషల్‌ మీడియా అస్సలు చూడొద్దని నాకు చెప్పారు. అయినా నేను వినలేదు. ఓపెన్‌ చేశాను.ఆ తర్వాత నా కుటుంబంతో మాట్లాడాను.

చాలా మంది నా బ్యాగ్రౌండ్‌ గురించి.. నేను ఎక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను అన్న విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రెండు- మూడు రోజుల పాటు ఆ కామెంట్లు నన్ను వెంటాడాయి. ఆ తర్వాత క్రమక్రమంగా నేను కోలుకున్నాను’’ అని యశ్‌ దయాళ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: IPL 2024: మళ్లీ ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ?!.. అంతకంటే సర్‌ప్రైజ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement