Ind Vs SA T20: Yuzvendra Chahal Hilariously Kicks Tabraiz Shamsi Back, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND Vs SA 2nd T20: ఓయ్‌ చహల్‌.. ఏంటా పని?

Published Mon, Oct 3 2022 11:54 AM

Yuzvendra Chahal Hilariously Kicks Tabraiz Shamsi-Back Video Viral - Sakshi

ఆట అన్నాకా కాస్త కళా, పోషణ ఉంటేనే మజాగా ఉంటుంది. ఎప్పుడు సీరియస్‌గా ఆడితే పెద్దగా కిక్‌  ఉండదు. అందుకే క్రికెట్‌ సహా ఇతర ఏ ఆటలైనా.. గొడవలు, సరదా సంఘటనలు లేకుండా చప్పగా సాగితే బోర్‌ కొట్టేస్తుంది. ఇక టీమిండియా స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ తన తుంటరితనాన్ని మరోసారి బయటపెట్టాడు. చహల్‌ ఫ్రేమ్‌లో ఉన్నాడంటే చాలు ఏదో ఒక చర్యతో నవ్వులు పూయిస్తుంటాడు.

తాజాగా సౌతాఫ్రికా, టీమిండియాల మధ్య జరిగిన రెండో టి20లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తబ్రెయిజ్‌ షంసీని చహల్‌ వెనుక నుంచి వచ్చి తన్నడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇదంతా కేవలం సరదా కోసమే.

విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ ముగిసిన తర్వాత క్రీజులో ఉన్న డికాక్‌, మార్క్రమ్‌లకు డ్రింక్స్‌ అందించడానికి తబ్రెయిజ్‌ షంసీ వచ్చాడు. మార్క్రమ్‌, డికాక్‌లతో కీపర్‌ పంత్‌ ముచ్చటిస్తున్నాడు. ఈలోగా అక్కడికి వచ్చిన చహల్‌.. వెనుక నుంచి షంసీని తన్నాడు. దీంతో పక్కనే ఉన్న డికాక్‌, మార్క్రమ్‌, పంత్‌లు నవ్వాపుకోలేకపోయారు.

వెంటనే వెనక్కి తిరిగిన షంసీ.. ఓయ్‌ చహల్‌ ఏంటా పని అన్నట్లుగా పేర్కొన్నాడు. మ్యాచ్‌ తిరిగి ఆరంభం కావడంతో  ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఇక లెగ్‌ స్పిన్నర్‌లైన చహల్‌, షంసీలు ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. చహల్‌ స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ రాగా.. ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ షంసీ స్థానంలో లుంగీ ఎన్గిడి మ్యాచ్‌ ఆడాడు.

మ్యాచ్‌ విషయానికి వస్తే టీమిండియా 16 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 237 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 221 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌ సెంచరీతో టీమిండియాను వణికించినప్పటికి.. చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో ప్రొటిస్‌కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో టీమిండియా ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను గెలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టి20 ఇండోర్‌ వేదికగా అక్టోబర్‌ 4న జరగనుంది.

చదవండి: ఇదొక్కటి చాలు.. కోహ్లి ఏంటో చెప్పడానికి!

స్వదేశంలో టీమిండియా కొత్త చరిత్ర..

Advertisement
 
Advertisement
 
Advertisement