బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా (105 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో షా బాధ్యతాయుతంగా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.
షా సెంచరీతో కదంతొక్కడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 207/6గా ఉంది. షా అజేయ సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా.. అతనికి జతగా ఇస్మత్ ఆలం (31) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ 121 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆదుకున్న షా
69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్‌ను రహ్మత్ షా ఆదుకున్నాడు. షా.. షాహీదుల్లా కమాల్ (22), ఇస్మత్ ఆలమ్‌ల సహకారంతో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. షా సెంచరీతో ఆదుకోకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఘోరంగా పతనమయ్యేది.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ 1, రియాజ్ హసన్ 11, హష్మతుల్లా షాహిది 13, జియా ఉర్ రెహ్మాన్ 6, అఫ్సర్ జజాయ్ 5 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 3, నగరవ 2, సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించగా.. సీన్ విలియమ్స్ (49) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్‌జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 157 పరుగులకే చాపచుట్టేసింది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment