నాటుబాంబు పేలి ఆవుకు తీవ్రగాయం
మనుబోలు: మండలంలోని మడమనూరు సమీపంలో మేత మేస్తున్న ఆవు పొరపాటుగా నాటు బాంబును కొరకడంతో అది పేలింది. దీంతో ఆవుకు తీవ్ర రక్త గాయమైంది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన గ్రామంలో సంచలనం రేకెత్తించింది. గ్రామానికి చెందిన పాడి రైతు అనింగి ద్వారకయ్య రోజూ మాదిరిగానే పశువులు తోలుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. పశువులు మేత మేస్తుండగా వేటగాళ్లు అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన నాటుబాంబును ఓ ఆవు కొరికింది. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధంతో బాంబు పేలింది. దూరంగా ఉన్న ద్వారకయ్య బాంబు శబ్ధానికి భయపడి దగ్గరుకు వచ్చి చూడగా, ఆవు దవడ భాగం చీలిపోయి రక్తమోడుతూ కనిపించింది. వెంటనే ఆవును పశువైద్యశాలకు తీసుకువచ్చి చికిత్స అందించారు. అయితే ఆవు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై బాధిత పాడి రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment