డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే.. | - | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..

Published Tue, Jan 28 2025 12:20 AM | Last Updated on Tue, Jan 28 2025 12:20 AM

డ్రైవ

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే.. బైక్‌, కారు డ్రైవ్‌ చేయడం వస్తే చాలదు. క్లిష్టమైన రహదారిలో కూడా కచ్చితమైన డ్రైవింగ్‌ చేయగలిగితేనే లైసెన్స్‌లు జారీ చేస్తారు. మనీ, మనుషుల సి‘ఫార్సు’ లైసెన్స్‌లకు చెక్‌ పెడుతూ ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ సిద్ధమైంది. నెల్లూరులో ఇకపై సెన్సార్లే.. లైసెన్స్‌లు జారీ చేస్తాయి. టెస్ట్‌ ట్రాక్‌లో బైక్‌ డ్రైవింగ్‌లో కచ్చితమైన నిబంధనలు పాస్‌ అవ్వాల్సిందే. కాలు కింద పెట్టినా.. పక్కన ఏర్పాటు చేసిన సెన్సార్లకు తగిలినా.. ఫెయిలే. అత్యాధునిక టెక్నాలజీతో పూర్తి చేసిన ఈ ట్రాక్‌ నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే శ్రీకారం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ద్వారానే లైసెన్స్‌లు జారీ కానున్నాయి.

నెల్లూరు (టౌన్‌): డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో సిఫార్సులకు చెక్‌ పడనుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నెల్లూరు నగరంలో ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ ద్వారా లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆటోమేటేడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ నిర్మాణ సిద్ధమైంది. ఇప్పటి వరకు మొక్కుబడిగా డ్రైవింగ్‌ చేసినా, ఎవరైనా సిఫార్సు చేసినా, డబ్బులిచ్చినా లైసెన్స్‌ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక నుంచి ఈ పప్పులు ఉడకవు. కారు, బైక్‌ను, ఆటోను కచ్చితంగా డ్రైవింగ్‌ చేస్తేనే లైసెన్స్‌ జారీ అవుతుంది. ట్రాక్‌లో డ్రైవింగ్‌ చేసే సమయంలో బైక్‌పై నుంచి కాలు కింద పెట్టినా సెన్సార్లు ఫెయిల్‌ చేస్తాయి.

రూ.1.21 కోట్లతో నిర్మాణం

నెల్లూరులో అత్యాధునిక ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ నిర్మాణ పనులకు గత ప్రభుత్వంలోనే శ్రీకారం జరిగింది. ఈ ట్రాక్‌ నిర్మాణానికి రూ.1.21 కోట్లు గత ప్రభుత్వం మంజూరు చేసింది. పనులను హైదరాబాద్‌కు చెందిన నిపున్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. ట్రాక్‌ను 8, హెచ్‌, అప్‌గ్రేడ్‌మెంట్‌, పార్లర్‌ పార్కింగ్‌ తదితర ఆకారాల్లో నిర్మాణం చేపట్టారు. డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌లో 13 సెన్సార్లు, 14 వీడియో కెమెరాలు, 8 వీఎంఎస్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు సెన్సార్లతో కూడిన బుల్లెట్లను వాహనం తిరిగే రోడ్లపై పదుల సంఖ్యలో ఏర్పాటు చేశారు. రోడ్లపై గుంతలు, ఎగుడు దిగుడు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

లైసెన్స్‌ జారీ ప్రక్రియ ఎలా అంటే..

నెల్లూరు నగరంలోని రవాణా కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కియోస్క్‌ మెషీన్‌ను ఏర్పాటు చేయనున్నారు. లైసెన్స్‌ కోసం వచ్చిన వాహనదారుడు కియోస్క్‌ మెషీన్‌లో వేలి ముద్ర వేయగానే టోకెన్‌ వస్తుంది. ఆ టోకెన్‌తో డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లోకి వెళ్లాల్సి ఉంది. బైక్‌, కారు, ఆటోలకు ట్రాక్‌ ప్రారంభంలో ఒకే దారి ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్లిన తర్వాత బైక్‌, కారు రూట్లను సిగ్నల్స్‌ ద్వారా చూపిస్తారు. ట్రాక్‌ ప్రారంభంలో సెన్సార్‌ ఉంటుంది. సెన్సార్‌ వద్దకు వెళ్లి టోకెన్‌ను స్కాన్‌ చేసినట్లయితే ట్రాక్‌పై బిగించిన వీఎంఎస్‌ బోర్డుపై గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుంది. దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా లోపం ఉంటే రెడ్‌ సిగ్నల్‌ వస్తుంది. గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన వాహనదారుడు సూచిక బోర్డుల ఆధారంగా వాహనాన్ని డ్రైవింగ్‌ చేయాల్సి ఉంటుంది. రోడ్డుపై ఏర్పాటు చేసిన సెన్సార్లు, బుల్లెట్లకు కాలు తగిలినా లేదా కాలు కింద పెట్టినా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వీఎంఎస్‌ బోర్డులో ఫెయిల్‌ అని వస్తుంది. పర్‌ఫెక్ట్‌గా డ్రైవింగ్‌ చేసినట్లయితే పాస్‌ అని వస్తుంది. లేదంటే మళ్లీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌ను ట్రాక్‌ ఎదురు గదిలో ఉన్న ఎంవీఐతో పాటు ప్రైవేట్‌ కంపెనీకి చెందిన ప్రతినిధులు పరిశీలిస్తుంటారు. ఈ ప్రక్రియలో రోజుకు 50 నుంచి 60 మందికి లైసెన్స్‌లు జారీ చేస్తారు. లైసెన్స్‌ కోసం ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రాక్‌లో సెన్సార్‌ సిస్టం

నెల్లూరులో ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ రెడీ

వచ్చే నెల 1వ తేదీ నుంచి

ఈ టెస్ట్‌ డ్రైవ్‌ ద్వారానే లైసెన్స్‌లు

డ్రైవింగ్‌ ట్రాక్‌లో 13 సెన్సార్లు, 14 వీడియో కెమెరాలు, 8 వీఎంఎస్‌ బోర్డులు

ట్రాక్‌ రోడ్డులో సెన్సార్లతో కూడిన బుల్లెట్ల ఏర్పాటు

రోజుకు 50 నుంచి 60 లైసెన్స్‌లే జారీ

ఈ ప్రక్రియపై నిపున్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పర్యవేక్షణ

బైక్‌పై నుంచి కాలు కింద పెట్టినా ఫెయిలే

చాలా మందికి లైసెన్స్‌ ఉన్నప్పటికీ కనీసం రహదారి నిబంధనలు కూడా తెలియడం లేదు. ప్రధానంగా డ్రైవింగ్‌ సమయంలో బ్యాలెన్స్‌ చేయలేకపోవడం, ఓవర్‌ స్పీడ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, మలుపుల సమయంలో ఇండికేటర్లు సరిగా ఉపయోగించకపోవడం, ఓవర్‌ టేక్‌, సిగ్నల్స్‌ను పాటించకపోవడం వంటివి ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల్లో ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో లైసెన్స్‌ల జారీతో ప్రమాదాలకు చెక్‌ పెట్టవచ్చని రవాణా అధికారులు చెబుతున్నారు.

ఫిబ్రవరి 1 నుంచి జారీ చేస్తాం

ఆటోమేటెడ్‌ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ ద్వారానే వచ్చే నెల 1వ తేదీ నుంచి లైసెన్స్‌లను జారీ చేస్తాం. ప్రతి ఒక్కరూ పూర్తిగా డ్రైవింగ్‌ నేర్చుకున్న తర్వాతనే లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. చిన్న తప్పు చేసినా ఫెయిల్‌ అవుతారు. ఫెయిల్‌, పాస్‌ అనేది ఎవరి చేతుల్లో ఉండదు. డ్రైవింగ్‌ విధానాన్ని బట్టి ట్రాక్‌లో ఏర్పాటు చేసిన వీడియో కెమెరాలు, సెన్సార్లు నిర్ణయిస్తాయి. వాహనాన్ని లైసెన్స్‌కు వచ్చిన వారే తెచ్చుకోవాల్సి ఉంది.

– బి.చందర్‌,

ఉప రవాణా కమిషనర్‌, రవాణా శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..1
1/6

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..2
2/6

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..3
3/6

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..4
4/6

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..5
5/6

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..6
6/6

డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన కల్పనకే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement