కార్పొరేషన్ అడ్డాగా పవర్ పాలిట్రిక్స్
నారాయణ పాలి‘ట్రిక్స్’ బెడిసికొడతాయా?
మంత్రి నారాయణ పవర్ పాలిటిక్స్‌తో ఆ పార్టీ లో అలజడి రేగుతోంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాక ముందే.. ఆ పార్టీ నేతల మధ్య రాజకీయ వైషమ్యాలు బట్టబయలవుతున్నాయి. కొద్ది నెలలుగా నెల్లూరు కార్పొరేషన్ అడ్డాగా జరుగుతున్న పవర్ పాలి‘ట్రిక్స్’ బ్లాస్ట్ అవుతున్నాయి. నగరపాలక సంస్థలో మంత్రి ఆధిపత్యాన్ని విభేదిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తాజాగా సినిమా మాస్ డైలాగ్‌లతో పరోక్షంగా నారాయణకే మాస్ వార్నింగ్‌లు ఇచ్చారు. తాను రోడ్డెక్కితే తట్టుకోలేరంటూ అటు మంత్రికే కాకుండా నగర పాలక సంస్థల అధికారులను హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సింహపురి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలకు పాలన, అభివృద్ధి కేంద్రంగా ఉన్న నగరపాలక సంస్థ.. అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్యానికి అడ్డాగా మారింది. ఇప్పటి వరకు జరుగుతున్న అంతర్యుద్ధం.. ఇక బహిరంగ యుద్ధంగా మారినట్లు కనిపిస్తోంది. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలిచిన పొంగూరు నారాయణ.. మున్సిపల్‌శాఖ మంత్రి కావడంతో నెల్లూరు కార్పొరేషన్‌లో పట్టు సాధించేందుకు పవర్ పాలిటిక్స్‌కు తెరతీశారు. నగరపాలక సంస్థ పరిధిలో నెల్లూరు నియోజకవర్గం ఉన్నప్పటికీ అక్కడి స్థానిక ఎమ్మెల్యే ప్రయేయం లేకుండా.. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ ఏకపక్ష నిర్ణయాలతో పవర్ పాలి‘ట్రిక్స్’కు బీజం వేశారు. మంత్రి నారాయణ.. తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేషన్ పరిధిలోని నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకే కాకుండా.. రూరల్ నియోజకవర్గ ప్రజలకు కంటగింపుగా మారాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మంత్రి నారాయణ నిర్ణయాలను, పవర్ పాలి‘ట్రిక్స్’తో తీవ్రంగా విభేదిస్తున్నారు. తాజాగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టినా సహించబోమని నా పవర్ ఏమిటో చూపిస్తానంటూ అధికారులకు మాస్ వార్నింగ్ ఇస్తూనే పరోక్షంగా మంత్రికి కూడా మాస్ వార్నింగ్ ఇవ్వడం చూస్తే.. మంత్రితో ప్రత్యక్షంగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆధిపత్యమా?.. పవరా?
నారాయణ తన శాఖ పరిధిలో ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌ను తన అధీనంలో ఉంచుకున్నాడు. మంత్రి కావడంతో కార్పొరేషన్ అధికారులు సైతం ప్రొటోకాల్ ప్రకారం మంత్రి ఆదేశాలకే విలువిస్తున్నారు. పన్నులు వసూళ్ల వ్యవహారం నుంచి బిల్డింగ్ ప్లాన్ అఫ్రూవల్స్ అంతా కూడా రూరల్ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే పని కానిచ్చేలా చేస్తున్నారు. గతంలో కార్పొరేషన్‌లో ఏ చిన్న పని కావాలన్నా స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించేవారు. ప్రస్తుతం రాజకీయ నేతలకు సంబంధం లేకుండానే అన్ని పనులు అధికారుల ద్వారా చక్కబెడుతున్నారు. ఈ విధానం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి నచ్చలేదు. ఇప్పటికే నాలుగు దఫాలుగా మంత్రికి వివిధ రకాలుగా వార్నింగ్‌లు ఇచ్చినా చెవికెక్కించుకోలేదు. ప్రత్యేకించి నగర కార్పొరేషన్‌లో జరిగే సమీక్ష సమావేశాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
విభేదాలకు కారణాలివే..
● నగరంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు పన్నుల బకాయిలు చెల్లించకుంటే ఇంటి ముందు డప్పుమోత, ఇంటి గేటుకు తాళాలు వేయడం, విద్యుత్ కనెక్షన్స్ కట్ చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం.
● ఉద్యోగులు, అధికారుల బదిలీల్లో ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కాకపోవడం.
● నెల్లూరు రూరల్ పరిధిలో ఎక్కువగా ఉన్న అనధికార లే అవుట్లకు సంబంధించిన వాటిపై కత్తి పెట్టి వాటి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం, విద్యుత్ కనెక్షన్లు నిలిపివేయాలనే ఆదేశాలు. ఆయా లేఅవుట్లు కూడా పాతవి కావడంతో పాటు యజమానులు సైతం స్థానిక ఎమ్మెల్యేకు అనుచరులు కావడం.
● భవన ప్లానింగ్ విషయంలో రాజకీయ నేతల ప్రమేయం లేకుండానే నేరుగా అఫ్రూవల్ ఇవ్వడం.
● అఫ్రూవల్ లేని భవంతులను నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా కూల్చి వేయడం తదితర కారణాలతోనే ఆ ఇద్దరి మధ్య విభేదాలకు కారణమని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
పుష్ప సినిమా మాస్ డైలాగ్‌లతో వార్నింగ్‌లు
ఇప్పటికే నాలుగు నెలలుగా మంత్రి, ఎమ్మెల్యే మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ పరిస్థితి శ్రుతిమించడంలో తాడోపేడో తేల్చుకునేందుకు కోటంరెడ్డి సిద్ధపడ్డాడు. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి పదవి రాకుండా నారాయణ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడన్న రాజకీయ ప్రచారం వారిద్దరి మధ్య అగాధం పెంచింది. ఓ వైపు కార్పొరేషన్‌లో పెత్తనం లాగేసుకోవడం, తన చిరకాల వాంఛగా ఉన్న మంత్రి పదవి దూరమయ్యే అవకాశం కనిపిస్తుండడంతో మంత్రిపై ప్రత్యక్ష యుద్ధానికి కాలు దువ్వేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నెల్లూరు కార్పొరేషన్‌లో సోమవారం మాస్ డైలాగ్‌లతో ప్రత్యక్షంగా అధికారులకు, పరోక్షంగా మంత్రికి వార్నింగ్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ పుష్ప సినిమాలో ఓ పోలీస్ అఽధికారి డైలాగ్‌తో కార్పోరేషన్‌లో ఒక్కటి తగ్గిందంటూ.. మాస్ డైలాగ్‌లు వదిలారు. కిండల్ పడొద్దు.. వేషాలు వేయొద్దు.. తమాషాలు చేయొద్దంటూనే.. నేను రోడ్డెక్కితే మీరు తట్టుకోలేరంటూ మాస్ వార్నింగ్‌లు ఇవ్వడం సంచలనంగా మారింది.
కార్పొరేషన్‌లో ఆధిపత్యానికి అంతర్యుద్ధం
మంత్రి నారాయణ నిర్ణయాలను
విభేదిస్తున్న ఎమ్మెల్యే
సినిమాటిక్ మాస్ డైలాగ్‌లతో
కోటంరెడ్డి హడావుడి
నేను రోడ్డెక్కితే తట్టుకోలేరంటూ
మాస్ వార్నింగ్
విద్యాసంస్థల అధినేతగా, వ్యాపారవేత్తగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన పొంగూరు నారాయణ టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికై .. మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో నారాయణ పవర్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. కానీ ఈ దఫా ప్రత్యక్ష బరిలో దిగి ఎన్నికై న నారాయణ అదే మంత్రిత్వ పదవులు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన పొలిటికల్ ట్రెండ్ మార్చేశారు. పవర్ పాలిటిక్స్‌తో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జిల్లాలో పవర్ పాలిట్రిక్స్‌లో ఆరితేరిన మరో మంత్రి ఆనంతోపాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఉన్నారు. రాజకీయాల్లో డక్కాముక్కిలైన వీరిని తట్టుకుని ఎంత వరకు రాణించగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment