కప్పం కట్టి.. రేషన్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

కప్పం కట్టి.. రేషన్‌ దందా!

Published Fri, Apr 4 2025 12:11 AM | Last Updated on Fri, Apr 4 2025 12:11 AM

కప్పం కట్టి.. రేషన్‌ దందా!

కప్పం కట్టి.. రేషన్‌ దందా!

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పేదలకు అందాల్సిన చౌక బియ్యం.. పచ్చనేతలకు కాసులు కురిపించే వ్యాపార వస్తువుగా మారింది. జిల్లాలో 1513 చౌకదుకాణాలు ఉన్నాయి. ప్రతినెలా 13 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కార్డుదారులకు పంపిణీ జరుగుతుంది. 11 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి చౌకదుకాణాలకు బియ్యం సరఫరా చేస్తున్నారు. బియ్యం పంపిణీలో దాదాపు 60 శాతం అంటే 8 వేల మెట్రిక్‌ టన్నులు రీసైక్లింగ్‌ చేస్తున్నారు. ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి దాదాపు 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించి మొత్తం మీద 20 వేల టన్నుల వరకు రేషన్‌బియ్యాన్ని పాలిషింగ్‌ చేసి చైన్నె మార్కెట్‌తో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

నియోజకవర్గం ఒకరికే..

నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన ఓ వ్యాపారి రేషన్‌ బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. కందుకూరులో ఒంగోలుకు చెందిన వ్యాపారికి అప్పగించారు. ఉదయగిరిలో జలదంకి చెందిన లోకల్‌ ప్రజాప్రతినిధి అనుచరుడు, ఆత్మకూరు, కోవూరులో నెల్లూరుకు చెందిన వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారు. కావలిలో లోకల్‌ వ్యాపారికే అప్పగించారు. ఇలా నియోజకవర్గాల వారీగా ఒక్కో వ్యాపారికి అప్పగించి వారి నుంచి నెలవారీగా సుమారు రూ.25 లక్షల వరకు ఎమ్మెల్యేలు కప్పం వసూలు చేస్తున్నారు.

రైస్‌మిల్లుల్లో పాలిషింగ్‌ చేసి..

ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ బియ్యం సేకరణ చేస్తారు. సేకరించిన బియ్యాన్ని సదరు వ్యాపారికి చెందిన అల్ల్లీపురంలోని గుడిపల్లిపాడు, మూడో మైలు వద్ద, రాజుపాళెం సమీపంలో ఉన్న రైస్‌మిల్లు, వెంకటాచలం మండలం పోర్టు వద్ద రైస్‌మిల్లు, బుచ్చిరెడ్డిపాళెంలోని విలియమ్స్‌పేట వద్ద ఉన్న రైస్‌మిల్లుకు, లింగసముద్రం మండలం పెదపవనిలోని రైస్‌ మిల్లుకు, కందుకూరులోని ఓగూరులో రైస్‌మిల్లుకు తరలిస్తారు. అక్కడ రీపాలిష్‌ చేసి బ్రాండెడ్‌ బ్యాగుల్లో నింపి చైన్నెకు తరలిస్తారు. చైన్నెలో పాలిష్‌ చేసిన బియ్యాన్ని కేజీ రూ.50 వంతున అక్కడ వ్యాపారులకు విక్రయిస్తారు. దాంతో పాటు పాలిష్‌ చేయని బియ్యాన్ని మాత్రం కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు చేస్తారన్న ఆరోపణలున్నాయి.

ఉమ్మడి జిల్లాల నుంచి సేకరణ

మంత్రి నారాయణ ఇలాఖాకు చెందిన బియ్యం మాఫియా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాటు మరో ఉమ్మడి ప్రకాశం, కడప రేషన్‌ బియ్యం సేకరణ చేస్తారు. ప్రకాశం జిల్లా నుంచి కందుకూరు, కావలి మీదుగా నెల్లూరుకు బియ్యం రవాణా జరుగుతుంది. ఇలా సేకరించిన బియ్యాన్ని ఎన్టీఆర్‌ నగర్‌లోని గోదాముల్లో నిల్వ ఉంచుతారు. అక్కడ నుంచి రాత్రి వేళల్లో రైస్‌మిల్లుకు తరలించి రీసైక్లింగ్‌ చేస్తారు. గోదాముల నుంచి నేరుగా చైన్నె, పోర్టులకు వెళ్తాయి.

అధికారులకు ముడుపులు

చౌక బియ్యం దందా సజావుగా సాగేందుకు రెవెన్యూ, పోలీస్‌, విజిలెన్స్‌, పౌర సరఫరా శాఖలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాత్రివేళల్లో రేషన్‌ బియ్యం వాహనాల్లో లోడింగ్‌ జరుగుతుండే విషయం అందరికీ తెలిసినా ఆ వైపు కన్నెత్తిచూడరు. విజిలెన్స్‌, పోలీస్‌ శాఖలకు ఫోన్‌ చేస్తే సదరు వ్యాపారికి ఫోన్‌ వెళ్తుంది. వెంటనే ఫోన్‌ చేసిన వారికి బెదిరింపు కాల్స్‌ వస్తాయి. పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫోన్‌చేస్తే మాకు మెన్‌ లేరు. పోలీసులకు ఫోన్‌చేయండి అంటూ కాల్‌ కట్‌ చేస్తారు.

ప్రతి నెలా ఏడు వేల మెట్రిక్‌ టన్నుల సేకరణ

పాలిషింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా ఆరు రైస్‌ మిల్లులు

పాలిష్‌ చేసి చైన్నె మార్కెట్‌కు తరలింపు

కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి

పచ్చ నేతలకు నెలకు రూ.కోట్లలో ఆదాయం

విజిలెన్స్‌, పోలీస్‌ శాఖలకు మామూళ్లు

నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఓ రేషన్‌ బియ్యం వ్యాపారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన స్నేహితుడితో కలిసి మాఫియాను హస్తగతం చేసుకున్నారు. గతంలో నెల్లూరు నగరంలోని దాదాపు వెయ్యి మంది చిరు వ్యాపారులు రేషన్‌ డీలర్లు, ఎండీయూ వాహన ఆపరేటర్ల నుంచి పేదలకందాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేసి తద్వారా సదరు వ్యాపారికి విక్రయించేవారు. కేజీకి రూ.16 వంతున డీలర్లకు అప్పగించి ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన వ్యాపారికి కేజీ రూ.23 వంతున విక్రయించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చిరువ్యాపారులను పక్కన పెట్టేశారు. కార్పొరేషన్‌ పరిధిలో మంత్రి నారాయణ కీలక అనుచరుడితో పాటు నెల్లూరు రూరల్‌ షాడో ఎమ్మెల్యేలకు నెలసరిగా రూ.లక్షల్లో ముట్టుజెప్పేలా ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి.

కఠిన చర్యలు తీసుకుంటాం

బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. చౌక దుకాణాల ద్వారా రేషన్‌ కార్డు దారులకు బియ్యం సక్రమంగా పంపిణీ జరిగేలా చర్యలు చేపడతాం. బియ్యం అక్రమ రవాణాపై ఫిర్యాదులు చేస్తే దాడులు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటాం. రేషన్‌ సక్రమంగా పంపిణీ జరిగేలా మండల స్థాయి అధికారులకు ఆదేశాలిస్తాం.

– అంకయ్య ఇన్‌చార్జ్‌, డీఎస్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement