
ఆర్టీసీ బస్సును ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్
● 12 మందికి గాయాలు
● తప్పిన పెను ప్రమాదం
సంగం: ఆర్టీసీ బస్సును సిమెంట్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 12 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ఆత్మకూరు వైపు నుంచి వాహనాలు సంగం వైపునకు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం మేరకు.. శనివారం నెల్లూరు నుంచి పామూరుకు 30 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. ఇది సంగం బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడి నుంచి పామూరుకు వెళ్లేందుకు బయలుదేరి నాలుగురోడ్ల సెంటర్ వద్ద బస్సు జాతీయ రహదారిని దాటుతోంది. ఈ సమయంలో సంగం నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న భారీ సిమెంట్ ట్యాంకర్ బస్సు మధ్య భాగంలో ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కేకలు వేశారు. అదే సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి బస్సులో ఉన్న ప్రయాణికులను దించి సంగం వైద్యశాలకు 108 అంబులెన్స్‌లో తరలించారు. ఉసురుపాటి రాజమ్మ, జలదంకి వెంకటేష్, స్వర్ణ సువార్తమ్మ, వెలుపుల తిరుపతయ్య, ఒరిగినేని వెంకటేశ్వర్లు, షేక్ షమీర్, కృష్ణారెడ్డి, భూమిరెడ్డి అభినయ, యల్లసిరి రమణమ్మ, మహేష్, బుజ్జమ్మ, మరో యువకుడు గాయపడ్డారు. ఎస్సై రాజేష్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు, గ్రామస్తులు కలిసి రోడ్డుకు అడ్డుగా ఉన్న బస్సును పోలీసులు, పక్కకు నెట్టారు. ట్యాంకర్‌ను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి రాకపోకల్ని పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగం వైద్యశాలలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని నెల్లూరు, ఆత్మకూరు వైద్యశాలలకు తరలించారు.
నిత్యం ప్రమాదాలు
సంగం నాలుగు రోడ్ల సెంటర్‌లో 10 రోజుల్లో మూడుసార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో గ్రామస్తులు, బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా వాహనదారులు మితిమీరిన వేగంతో వస్తుండటమే ప్రమాదాలకు కారణం. పోలీసులు హిల్ రోడ్డు దిగే ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్