ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం

Published Tue, May 7 2024 1:15 AM

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం

అనంతపురం కార్పొరేషన్‌: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్‌కే సుధీంద్రనాథ్‌, జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రవేశపెట్టిందన్నారు. నీతి అయోగ్‌ పంపిన రఫ్‌ డ్రాఫ్ట్‌ ముసాయిదా రాజ్యాంగానికి లోబడి ప్రజలకు మంచి చేసే విధంగా లేదని తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమం లోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనుగుణంగా సహజ న్యాయ సూత్రాలను అనుసరించి మార్పు చేసుకోవచ్చని తెలియజేసిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకుని, పేద ప్రజలకు న్యాయం చేసేలా చట్టాన్ని తయారు చేసి అసెంబ్లీలో ఆమోదం చేసి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారన్నారు. బిల్లు లోపభూయిష్టమని, ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పే టీడీపీ నాయకులు, బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

ఎమ్మెల్యే పయ్యావుల మెచ్చుకోలేదా?..

అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ ఈ చట్టం ప్రయోజనకరమని, దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ‘ఈటీవీ’ అన్నదాత కార్యక్రమంలోనూ మంచి చట్టమని, గతంలో రెండు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే వారని అలా కాకుండా ఒకే డాక్యుమెంట్‌ ఇస్తారని చెప్పింది వాస్తవం కాదా? అన్నారు. అలాంటి వారు నేడు దుష్ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. చట్టానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్లారని, ఈ క్రమం లోనే కోర్టు స్పందిస్తూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రావాలని, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే అప్పుడు చూస్తామని, దీనిపై ఎక్కడా మాట్లాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయినా, చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. చట్టం పూర్తిగా అమలులోకి రావాలంటే భూముల సర్వే జరగాలని, ఆ తర్వాత ప్రభుత్వం టైటిలింగ్‌ అధికారులు, అప్పిలేటింగ్‌ అధికారులను నియమించి, గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తే అప్పుడు పరిపూర్ణంగా అమలులోకి వస్తుందన్నారు. ఇతర దేశాల్లో ఈ చట్టం మంచి ఫలితాలను ఇచ్చిందని వివరించారు. టీడీపీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి నాగన్న తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే

చంద్రబాబు ఎత్తుగడలు

వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర

అధికార ప్రతినిధి ఎల్‌కే సుధీంద్రనాథ్‌

Advertisement
 
Advertisement