అరాచకాలకు మంత్రి సవిత ఆజ్యం
పరిగి: పెనుకొండ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు, అరాచకాలు, అలజడులకు మంత్రి సవిత ఆజ్యం పోస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు. ఆదివారం పరిగి మండలం మోదాలో ఉషశ్రీచరణ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ మంత్రి సవిత, ఆమె భర్త వెంకటేశ్వరరావుపై విమర్శలు చేశారు. పెనుకొండలో శనివారం శివమాలధారుడు శ్రీనివాసులుపై మంత్రి ప్రధాన అనుచరుడు దాదు చెప్పుల కాలితో దాడిచేసి, అవమానపరిచాడని, ఇందుకు మంత్రి సవిత బాధ్యత వహించాలని అన్నారు. మంత్రి దంపతుల ప్రోద్బలంతోనే అరాచకాలు పేట్రేగిపోతున్నాయని, పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. పెనుకొండలో సుధాకర్‌రెడ్డి భూమి కబ్జా చేసినా, జయచంద్రారెడ్డికి మంత్రి భర్త అనుచరుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పినా పట్టించుకోని పోలీసులు తాజాగా గోరంట్లలో ఓ వ్యవహారంలో ఎంక్వయిరీ పేరిట నార్శింపల్లి శివారెడ్డిని మంత్రి ప్రోద్బలంతోనే అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అరెస్టు చేశారన్నారు. అక్రమ కేసులపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అధికార బలంతో అరాచకాలు సృష్టించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న మంత్రి సవితకు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. తక్షణమే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమాలు వెలుగుచూస్తాయన్నారు.
శివమాలధారుడిపై దాడికి మంత్రిదే బాధ్యత
అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి
మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment