సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జనసేనకు పొత్తులో ఉత్తి చేతులే మిగులుతున్నాయా..? పోటీ చేయకపోయి నా భుజాన పచ్చ జెండాలు మోయాల్సిందేనా..? పొత్తులో నష్టం జరిగినా భరించాల్సిందేనని పవన్ చెప్పిన మాట వాస్తవమేనా..? జిల్లాలో పరిస్థితులు చూస్తుంటే అన్నింటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. జిల్లాలో ఒక్క చోటైనా పోటీ చేస్తామా.. అని జనసేన కార్యకర్తలు అడిగితే సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఆ పార్టీ అధిష్టానం లేదు. మరోవైపు టీడీపీ ఇస్తున్న లీకులు, ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను చూసి మనకు ఈ సారి ‘జీరో’నే అన్న నైరాశ్యంలోకి అంతా వెళ్లిపోతున్నారు.
మాకు పట్టుంది నమ్మండి..
జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో తమకు పోటీ చేసే సత్తా ఉందని జనసేన నాయకులు చెబుతున్నారు. వాటిలో కనీసం రెండు మూడు నియోజకవర్గాలైనా తమకు కేటాయించాలని అడుగుతున్నారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఉందని టీడీపీతో పోటీ పడుతున్నారు. అధిష్టానం కూడా ఆశల్లో ఊరేగిస్తూ చివరకు తుస్సుమనిపిస్తోంది. తప్పకుండా మనకు కొన్ని నియోజకవర్గాలు వస్తాయని, రోజుకొక నియోజకవర్గాన్ని తెరపైకి తీసుకురావడం, ఆ తర్వాత విస్మరించడం చేస్తోంది. మొదట ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాలు జనసేనకు వస్తాయని పార్టీలో చర్చించుకున్నారు. అధిష్టానం కూడా సూచన ప్రాయ సంకేతాలిచ్చిందని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కొన్ని రోజుల్లోనే ఆ ప్రతిపాదన పక్కకు వెళ్లింది. తర్వాత పలాస, పాతపట్నం, ఇచ్ఛాపురం, ఆమదాలవలస నియోజకవర్గాలు తెరమీదకి వచ్చాయి. కానీ క్లారిటీ ఇవ్వలేదు సరికదా అసలు జిల్లాకు ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించడం లేదని టీడీపీ లీకులు ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా ఎల్లోమీడియాలో కథనాలు వండి వార్చింది. అనుకున్నట్టుగానే ఆ నాలు గు నియోజకవర్గాల ప్రతిపాదిత కార్యాచరణ ముందుకు సాగలేదు. తాజాగా పాతపట్నం, పలాస నియోజక వర్గాలు తెరపైకి వచ్చాయి. ఈ రెండింటిలోనూ జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు నర్మగర్భంగా చెబుతున్నారు. ఆశావహులను పక్కన పెడితే కేడర్ మాత్రం మన జిల్లాలో జనసేన సీట్లు కేటాయించే అవకాశం లేదని, గెలిచే సామ ర్థ్యం లేనందున అధినాయకుడు పవన్ కళ్యాణ్ పెద్దగా జిల్లాపై దృష్టి సారించడం లేదని చెప్పుకొస్తున్నారు.
టీడీపీని మోయాల్సిందే
ఇప్పుడున్న పరిణామాలను చూస్తుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేనకు అవకాశం లేదని స్పష్టమవుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు 25 సీట్లు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారని, అందులో శ్రీకాకుళం నుంచి ఒక్కటి కూడా లేదని తెలుస్తోంది. ఈ జిల్లాలో ఇచ్చేందుకు చంద్రబాబు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే సందర్భంలో మనకు సీట్లు వచ్చినా, రాకపోయినా పొత్తులో భాగంగా టీడీపీ జెండాలు మోయాల్సిందే నని మరోవైపు పవన్ కల్యాణ్ నిర్మోహమాటంగానే నాయకులకు చెప్పేస్తున్నారు. ఎవరి బలమేంటో, ఏ పార్టీకి ఎంత పట్టు ఉందో తెలుసునని, తనకొక వ్యూహం ఉందని, తాను ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా పనిచేయాలని ఆదేశిస్తున్నారు.
దీంతో జనసేన నాయకులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. పలాస, పాతపట్నంలో టీడీపీ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయని, గ్యారెంటీగా ఓడిపోయే స్థానాలని, ఆ పరిస్థితుల్లో వారిని కాదని జనసేనకు ఇస్తే ఇవ్వవచ్చని లేదంటే జనసేనకు జిల్లాలో జీరోయే అన్న అభిప్రాయంలో జనసైనికులు ఉన్నారు. ఒకవేళ జనసేనకు ఒకటి రెండు వచ్చినా వాటిలో కూడా తొలి నుంచి పనిచేస్తున్న వారిని కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారినే పోటీలో పెడతారన్న వాదనలు కూడా నడుస్తున్నాయి. అదే జరిగితే ఐదేళ్లుగా పార్టీకోసం పనిచేసి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తమను అధినాయకుడు నిండా ముంచినట్టే, తమ ఆశలపై నీళ్లు చల్లినట్టేనని వారంతా ఆందోళనతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment