ప్రసంగం మధ్యలో సభ నుంచి వెళ్లిపోతున్న జనం
ఎల్.ఎన్.పేట/పాతపట్నం/మెళియాపుట్టి: పాతపట్నంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం నిర్వహించిన శంఖారావం బహిరంగ సభ వచ్చామా.. వెళ్లామా అన్నట్లు సాగింది. గత సభల్లో చేసిన ప్రసంగాన్నే లోకేష్ మళ్లీ కొనసాగించడంతో జనం విసిగిపోయారు. ఎక్కువ కేసులు నమోదైన పార్టీ నాయకునికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నానని అన్నారు. చంద్రబాబుపై ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో వేసిందని ఆరోపించారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో అవినీతికి పాల్పడిన వారిని విడిచి పెట్టేది లేదని, అందరి పేర్లు ఎర్రబుక్కులో రాస్తున్నారని అన్నారు. అయితే సభ జరుగుతుండగానే జనం బయటకు వెళ్లిపోయారు.
సభ మధ్యలో ఖాళీ కు ర్చీలు కనిపించాయి. సమావేశం ముగింపు సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో సభంతా ఖాళీ అయిపోయింది. సభ ముందు వరుసలో ఉన్న ముఖ్యనాయకులే మిగిలిపోయారు. పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట, సామాజిక వేత్త ఎంజీఆర్ ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయారు. లోకేష్ సభలో రెండు వర్గాల వారు వారి బలాబాలాలను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే కలమట వ్యవహరిస్తున్నారు. ఆశావహులుగా ఎంజీఆర్ పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలో మంగళవారం జరిగిన లోకేష్ సభా వేదిక పైకి ఎంజీఆర్‌ను రానీయకుండా అడ్డుకునేందుకు కలమట గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ఎంజీఆర్‌ను లోకేష్ సభా వేదిక పైకి పిలవటంతో పాతపట్నంలో రెండు వర్గాలు బలంగా పోటీ పడుతున్నాయని స్పష్టమైపోయింది. పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరు ప్రకటిస్తారని ఆశించారు. అయితే టీడీపీ, జనసేన నాయకులు అభ్యర్థిని ప్రకటిస్తారని చెప్పడం.. జనసేన పేరు కలపడంతో టీడీపీకి చెందిన నాయకులంతా నిరాశకు లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment