చెప్పింది చేయాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

చెప్పింది చేయాల్సిందే..

Published Tue, Jan 28 2025 12:36 AM | Last Updated on Tue, Jan 28 2025 12:36 AM

చెప్ప

చెప్పింది చేయాల్సిందే..

జిల్లా కేంద్రంలో అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు

కీలక నేత, షాడో నేతల టార్చర్‌ తట్టుకోలేక పోతున్న పరిస్థితి

మున్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌

స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు

ఒత్తిళ్లే కారణమని వాదనలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. నేతలు, షాడో నేతల ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. నేతల సతాయింపు ఎక్కువైపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొంతమందైతే ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిదన్న ఆలోచనకు వచ్చేస్తున్నారు. మరికొందరు ఉద్యోగాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధమవుతున్నారు. మున్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ దక్షిణామూర్తి స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు పెట్టుకోవడం, అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించడం చర్చనీయాంశమైంది. ఎప్పటి నుంచో తనకు ఈ ఆలోచన ఉందని దక్షిణామూర్తి బయటకు చెబుతున్నా.. లోలోపల ఒత్తిళ్లే కారణమన్న వాదనలు ఉన్నాయి.

ఓ వైపు అభద్రత.. మరో వైపు అశాంతి

కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకే కాదు అధికారులకు కూడా మానసిక ప్రశాంతత కరువైంది. నగరంలో నిత్యం ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటోంది. హత్యలు, దాడులు, అత్యాచారాలు, దొంగతనాలు, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు తదితర పరిణామాలతో ప్రజల్లో భయాందోళన నెలకుంది. ఎప్పుడెక్కడ ఏం జరుగుతుందో ఎవరేం చేస్తారో అన్న భయం పట్టుకుంది. ఎవరి వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న అభద్రతా భావం నెలకొంది. ప్రజలకు ఇలాంటి పరిస్థితి ఉంటే అధికారులకు మరో రకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేషన్‌లో ఉన్న పలువురిపై నేతల మాటలు, ఒత్తిళ్లు తార స్థాయికి చేరిపోయాయి. టెండర్ల దగ్గరి నుంచి పనులు చేపట్టే వరకు నేతల సతాయింపును తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రథసప్తమి వేడుకల పేరుతో కొందర్ని టార్చర్‌ పెడుతున్నారనే వాదనలు ఉన్నాయి. తొందరగా పనులు చేపట్టాలన్న ఆరాటంలో తమ్ముళ్లకు పంచి పెట్టిన కాంట్రాక్ట్‌ వర్క్‌లను నాణ్యతకు తిలోదకాలిచ్చి త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులపై చేస్తున్న ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో అధికారులు సైతం తప్పులు చేసే పరిస్థితికి వెళ్లిపోయారు. దీనికి స్థానిక మిల్లు జంక్షన్‌ వద్ద బాబూ జగ్జీవన్‌రావు విగ్రహం వద్ద నిర్మించ తలపెట్టిన ఫౌంటెనే ఉదాహరణ. ఒకసారి కట్టి, మరొకసారి కొంత కూల్చి, తర్వాత నిర్మాణం పూర్తి చేసి, అంతా అయ్యాక మొత్తం కూల్చేయడం నగర ప్రజలను విస్మయానికి గురి చేసింది. ప్రజాధనం దుర్వినియోగమైపోతుందని అది చూసిన వారంతా పెదవి విరుస్తున్నారు. ఇక గోడలకు రంగులు విషయంలో కూడా అదే జరిగింది. టీడీపీ నాయకులకు కాంట్రాక్ట్‌ ఉపాధి కోసం బాగున్నచోటే మళ్లీ రంగులేసే కార్యక్రమంతో కోట్ల రూపాయం దుర్వినియోగం చేశారు. ఈ విషయంలో అధికారులు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చెప్పింది చేయాల్సిందే.. 1
1/1

చెప్పింది చేయాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement