ముసుగు తీసిన మోసగాడు చంద్రబాబు
● అచ్చెన్నాయుడివి డైవర్షన్ పాలిటిక్స్
● ఏడాది కాకముందే కూటమి ప్రభుత్వం పనైపోయింది
● విలేకరులతో వైఎస్సార్సీపీ
జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
కాశీబుగ్గ: ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి బూటకపు హామీలతో గద్దెనెక్కిన మోసగాడు నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు ముసుగు మొత్తం తీసేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. పలాసలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్‌తో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఏ హామీలైతోనైతే అధికారంలోకి వచ్చారో నేడు వాటిని నెరవేర్చలేమని నిస్సిగ్గుగా ప్రకటించి ప్రజలను దగా చేశారని ధ్వజమెత్తారు. సాక్షాత్తూ సచివాలయంలోనే ఈ ప్రకటన చేయడం చంద్రబాబు మార్కు దగాకు రుజువని దుయ్యబట్టారు. కూటమి ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లాలంటే సంకోచించే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చంద్రబాబు ప్రకటనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాది కాకముందే కూటమి ప్రభుత్వం పనైపోయిందని ఎద్దేవా చేశారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు.
– మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులినోట్లో తల పెట్టడమేనని తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు మరోసారి రుజువయ్యాయన్నారు. జగన్ విశ్వసనీయత, చిత్తశుద్ధి, సంకల్పం మరోసారి అందరూ గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. కూటమి పాలనలో తొమ్మిది నెలల్లోనే దాదాపు రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారని, ఎంత సంపద సృష్టించారో చెప్పా లని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పైల చిట్టి, పలాస కాశీబుగ్గ పట్టణ అధ్యక్షుడు శిష్టు గోపి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ సభ్యుడు దుబ్బ వెంకటరమణ, కళింగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సంపత్‌రావు, హేమసుందర్‌రాజు, పలాస మాజీ ఎంపీపీ బత్తిని హేమేశ్వరరావు, టెక్కలి నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షుడు పి.వెంకటరమణ, సీనియర్ నేత బడగల బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment